Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల బాలికలు అత్యుత్తమ మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విద్యార్థినులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై దృష్టి పెడితే గ్రామీణ ప్రాంతాల బాలికలు కూడా అద్భుత విజయాలు సాధించగలరని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసిస్తూ వైద్య, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు.

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో బైపీసీ (BiPC), ఎంపీసీ (MPC), ఎం.పి.హెచ్.డబ్ల్యూ (MPHW) విభాగాల్లో చదువుతున్న విద్యార్థినులు అధిక శాతంలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులకు సమానంగా నిలిచే మార్కులు సాధించడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఈ బాలికలు అన్ని అడ్డంకులను అధిగమించి సాధించిన ఈ విజయాలు విద్యా వర్గాల్లో ప్రశంసలు పొందుతున్నాయి.

విద్యార్థినుల కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వం, కేజీబీవీ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య ఈ ఫలితాలకు ప్రధాన కారణమని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఈ విజయాల వెనుక ఉన్న ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, తల్లిదండ్రుల సహకారాన్ని ప్రశంసించారు.

జిల్లాలోని అన్ని కేజీబీవీ పాఠశాలల్లో ఇదే తరహా ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. విజయాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని, భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ మాట్లాడుతూ కేజీబీవీ బాలికల ప్రతిభ జిల్లాకు గర్వకారణమని, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పర్యవేక్షణాధికారి శోభారాణి, ప్రత్యేక అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.