– ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా..?
– ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి.
– ఏఐఎఫ్.బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్.
ముద్ర, కరీంనగర్: ప్రజాస్వామ్యంలో ఒక ఉద్యోగి తన అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పా..? రైతుల సమస్యల గురించి మాట్లాడటం నేరమా..? అని ఏఐ ఎఫ్ బీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ప్రశ్నించారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం ప్రస్తుతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసిందన్నారు.
రైతుల సమస్యలపై మాట్లాడినందుకు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. “నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు అని అశోక్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం అతనిపై కఠిన చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఉద్యోగులకూ తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉండాలని బండారి శేఖర్ అన్నారు. తక్షణమే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.