ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి మే 12వ తేది వరకు ప్రసారాలు
రోజుకు రెండు గంటలు-42 రోజులు-84 పాఠ్యాంశాలు
ముద్ర, శేరిలింగంపల్లి :
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి టి-సాట్ డిజిటల్ లెసన్స్ అందించనుందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 13వ తేదీన నిర్వహించే పాలిసెట్ పరీక్ష కోసం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి రోజుకు రెండు గంటల చొప్పున 42 రోజుల పాటు 84 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు వివరించారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించిన పాఠ్యాంశాలు విద్య ఛానల్ లో సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు, రాత్రి తొమ్మిది నుండి 11 గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారమౌతాయని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పదవ తరగతి లేదా తత్సమానమైన పరీక్ష పాసైన విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించేందుకు టి-సాట్ పాఠ్యాంశ ప్రసారాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహ్మారావు పశుసంవర్థక శాఖ విశ్యవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయాల్లో అర్హత సాధించేందుకు విద్యార్థులకు ఎంట్రన్స్ ఉపయోగపడుతుందన్నారు.