- ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
- వానా కాలంలో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు గుర్తించాలి.
- అవసరమైతే అదనపు నిధులు తీసుకొచ్చి రక్షణ చర్యలు చేపట్టాలి.
- ప్రమాదాలు జరగడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి జడ్చర్ల: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే సహించేది లేదని, అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో బుధవారం విద్యుత్ షాక్ తో శ్రేయాన్స్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు.జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ లేని ట్రాన్ఫార్మర్లు ఉన్నాయని వాటి కారణంగా ప్రజల ప్రాణాలకు ఆపద వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని స్పష్టం చేసారు. ప్రత్యేకించి వానా కాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ప్రాంతాల్లోనూ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి కోరారు. రక్షణ లేని ట్రాన్ఫర్మర్ల వద్ద ప్రమాదాలు జరగడంతో పాటుగా గాలి వానలకు విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల కూడా ప్రాణాలు పోయే ప్రమాదాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే అధికారులు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాతంతాలను గుర్తించి, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. దీని కోసం అవసరమైతే అదనపు నిధులను ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి తాను కృషి చేస్తానన్నారు. అయితే ఇటీవల జడ్చర్లలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో అధికార సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే తాను సహించేది లేదని, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.
- హృదయం ద్రవించిపోయింది:
బుధవారం జడ్చర్లలోని 3వ వార్డులో విద్యుత్ షాక్ తో మరణించిన శ్రేయాన్స్ ను చూసి తన హృదయం ద్రవించి పోయిందని, జరిగిన సంఘటన తనను కలచివేసిందని అనిరుధ్ చెప్పారు.శ్రేయాన్స్ తండ్రి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొక్కా రాఘవేందర్ ను ఎమ్మెల్యే ఫోన్ లో పరామర్శించారు. బంగారు భవిస్యత్తు కలిగిన బాలుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం ఎంతో బాధాకరమని చెప్పారు. ఆ చిన్నారి మృతితో ఆ కుటుంబానికి ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. అయినా ఈ ఆపద సమయంలో ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కాగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి శశికళారెడ్డి శ్రేయాన్స్ భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. బొక్కా రాఘవేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.