- ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
- బోనాలు , వర్షాకాలంపై అధికారులతో సమీక్ష.
కుషాయిగూడ, ముద్ర విలేఖరి: బోనాల ఉత్సవాలు, వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అధికార యంత్రాంగాలు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు. కాప్రా సర్కిల్ ఉప కమిషనర్ జగన్ ఆధ్వర్యంలో గురువారం సౌత్ కమలానగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో బోనాల జాతర, వర్షాకాలం అత్యవసర బృందాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈనెల 20వ తేదీన జరగనున్న బోనాల ఉత్సవాలలో అమ్మవారి దేవాలయాలకు వెళ్లేందుకు రోడ్లు, వీధి దీపాలు, భక్తులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.ఇక ఆలయాలకు వచ్చే రోడ్లపై గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో అత్యవసర బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం మాన్సూన్ బాధ్యతలను హైడ్రా చేపడుతున్న నేపథ్యంలో.. వారితో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా డిసీ జగన్, ఈఈ నాగేందర్ మాట్లాడుతూ.. కాప్రా సర్కిల్ పరిధిలో బోనాల ఉత్సవాలకు ఆలయాల వద్ద రోడ్డు మరమ్మత్తులు ఇతర సౌకర్యాలకు రూ.11.30 నిధులు, మాన్సూన్ పనులకు రూ.50 లక్షల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఇక డివిజన్ల వారిగా అమ్మవారి ఆలయాల వద్ద అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల అధికారులను సమన్వయపరచుతూ.. పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఇక వర్షాకాలం దృష్ట్యా హైడ్రా విభాగం అధికారులకు జిహెచ్ఎంసి, విద్యుత్, జలమండలి, పోలీస్ తదితర విభాగాల అధికారులతో కొత్తగా కోఆర్డినేషన్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూపులో వచ్చే ఆదేశాలనుసారంగా అధికార యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసేలా ప్రణాళిక చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు విభాగాల అధికారులు వారు చేపట్టే పనులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో.. కుషాయిగూడ ఏసిపి వై వెంకట్ రెడ్డి, మల్కాజ్గిరి ఏసీపి చక్రపాణి, ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, రవికుమార్, సైదులు, జలమండలి డిజిఎమ్ సతీష్, జవహర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన్ శేఖర్ , విద్యుత్, హైడ్రా, జిహెచ్ఎంసి, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.