Take a fresh look at your lifestyle.

వైభవంగా కొనసాగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

రెండవ రోజు ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, బేరిపూజ, దేవతాహ్వానం,హవనం….

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, కార్యక్రమాలు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్యనిర్వహణాధికారి జె.భవాని శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ ఎమ్. హనుమంతరావు, పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.
ధ్వజారోహణం ప్రత్యేకత


బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామివారి అనుగ్రహంను పొందగోరి ద్వజపటముపై గరుడాళ్వారుని చిత్రించి, ఆరాదించి సకలోపచారములతో మేళతాళముల మధ్య శ్రీ స్వామివారి ఆలయ ధ్వజస్తంభముపై ధ్వజ పటమును అలంకరించెదరు. భగవానుని దివ్యదేహమే వేదమయమని ఆ వేద స్వరూపుడు గరుత్మంతుడు అని ఉత్సవ ప్రారంభ సూచకముగా ఆలయంలో ఈ వేడుక నిర్వహించెదరు. భగవత్ అనుగ్రహపూర్వకముగా నిర్వహించుటకు సమస్త దేవతలను ఈ వేడుకకు విచ్చేయమని వేడుకునే ప్రక్రియే ఈ ధ్వజారోహణం అంటారు. గరుడ ప్రసాదమును భక్తులు సంతాన సాఫల్యముగా స్వీకరించి స్వామి వారి అనుగ్రహమును పొందుట ప్రత్యక్ష నిదర్శనమై ఉన్నది..
సాయంకాల కార్యక్రమాలు
గురువారం సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం హవనం ప్రారంభించబడును. దేవతాహ్వానం, వేడుకలను భేరీపూజ, ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చ కబృందం, పారాయణీకులు నిర్వహిస్తారు.

భేరీపూజ ప్రత్యేకత

శబ్దమే బ్రహ్మం. భేరీ అనగా సాంప్రదాయానుసారముగా ఒక వాయిద్య సాధనము నుండి వెలువడు శబ్దము. ఆయారాగ తాళముల మధ్య మంత్రబద్ధమైన శ్లోకములను పఠించుచూ భేరీ తాడనం చేయుచూ ఈ వేడుక నిర్వహించెదరు. భేరీనాదము వినిపించునంతవరకు సర్వవిధదోష నివారణము జరిగి ఆరోగ్యము, మానసిక ఆనందము చేకూరునని జగత్ కళ్యాణ కారకమైన ఈ భేరీపూజ ద్వారా భగవానుడు తృప్తి చెంది అనుగ్రహించునని ఈ వేడుక నిర్వహించెదరు.

దేవతాహ్వానము ప్రత్యేకత

బ్రహ్మాత్సవాలలో భక్తకోటిని అనుగ్రహించు స్వామివారు దేవకోటిని అనుగ్రహించిన తీరు ఈ దేవతాహ్వానంలో సివించవచ్చును. 33 కోట్ల మంది దేవతలను మంత్రపూర్వకముగా ఆహ్వానము గావించుట ఈ వేడుక ప్రత్యేకత.

హవనము ప్రత్యేకత

బ్రహ్మాది దేవతలకు అందజేయు హవిస్సును ఆయా దేవతా సంబంధమైన మంత్రముల చేత హవనము గావించెదరు. విశ్వశాంతి లోకకళ్యాణము కలిగించు ఈ హవనము బ్రహ్మోత్సవములలో ఉత్సవాంతము వరకు ప్రత్యేకంగా నిర్వహించెదరు.

ఉచిత వైద్య శిబిరం

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తేదీ: 18-02-2026 నుండి తేదీ:28-02-2026 వరకు మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరం కొండపైనప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించబడును.

Leave A Reply

Your email address will not be published.