Take a fresh look at your lifestyle.

నేడు రాజ్ భవన్ కు కేటీఆర్ బృందం

‘బొగ్గు’కుంభకోణంపై విచారణ కోరే అవకాశం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నైనీ బొగ్గు టెండర్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ బృందం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నది. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో సీఎంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన వారికి పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్‌కు తెలియజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.