జడ్చర్లలో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం ,పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి ధర్మమని, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉంటారని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల శాఖా మంత్రి వాకిటి శ్రీహరిఅన్నారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమక్షంలో హాస్పిటల్ లోని జనరల్ వార్డు లో పరిశుభ్రత పనులు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో ప్రధానంగా పది అంశాలు తీసుకోవడం జరిగిందన్నారు. ముందుగా మున్సిపల్ చైర్మన్లకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు ఇదొక ప్రక్షాళన అని, ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం పై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుస్తున్నామని,అర్రైవ్ -అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహనకల్పిస్తున్నామన్నారు.రోడ్ల పై వాహనదారులు చేసే చిన్న పొరపాట్ల వల్ల ప్రమాదం జరిగి కుటుంబాలు వీధిన పడుతుయన్నారు. కార్లు,బైక్ లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. రహదారులపై బ్లాక్ స్పాట్ లు గుర్తించి స్పీడ్ కంట్రోల్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వాహనాలకు వెనక వైపు రేడియం స్టికర్లు తప్పనిసరిగా అంటించాలన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నా రు. గతంలో వరి వేస్తే ఉరి అన్నారని కాని ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో వరి వేస్తే సిరి అనేలా చేశామన్నారు. రైతులు పండించిన వరి పంటకు బోనస్ తో పాటు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల గౌరవం పెంచామని మంత్రి తెలిపారు.అర్హులైన పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామన్నారు.

మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు.స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంక్ ల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ లాంటి పథకాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
మన ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. భూ సేకరణ చేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందిన తర్వాతనే ప్రాజెక్ట్ లు ముందుకు సాగాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు.
పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు కు అన్ని అనుమతులు తీసుకొని త్వరలో కార్యరూపం దాల్చబోతుందని మంత్రి వెల్లడించారు.రాబోయే రోజుల్ ఈ ప్రాంతం మరో కోనసీమ కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ పుష్పలత, డీ ఎం హెచ్ ఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని బోయిన్‌పల్లి గ్రామంలో రూ.3.05 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర క్రీడలు, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందన్నారు . కొత్తగా ఏర్పాటు చేసిన ఈ 33/11 కేవీ సబ్‌స్టేషన్ ద్వారా మిడ్జిల్ మండలంలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. రైతులు, గృహ వినియోగదారులు,చిన్న పరిశ్రమలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిరంతరం సీఎం, మంత్రులతో నిధుల కోసం కృషి చేస్తుంటారని మంత్రి పేర్కొన్నారు. పనిచేయాలనే పట్టుదల కలిగిన నాయకున్ని జడ్చర్ల ప్రజలు ఎన్నుకున్నందుకు అదృష్టవంతులన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు.జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మిడ్జిల్ మండల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ లోడ్ తగ్గి, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.జడ్చర్ల నియోజకవర్గంలో 31 సబ్‌స్టేషన్లు మాత్రమే ఉండగా తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రెండేళ్ల లో 22 (33/11 కేవీ) సబ్‌స్టేషన్లు, నవాబ్‌పేట్‌లో 133/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేయించామని తెలిపారు. వాటిలో భాగంగా బోయిన్‌పల్లి గ్రామంలో మొదటి సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీహరి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ రెండేళ్లలో జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.213 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టేవారని, కానీ పనులు మాత్రం పూర్తి కాలేదని విమర్శించారు. తాను కొబ్బరికాయ కొడితే పని పూర్తయ్యే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.