- రాఫెల్ యుద్ధ విమానాల కూల్చివేత నష్టంపై కేంద్ర పారదర్శకంగా వ్యవహరించాలి.
- వైమానిక దళ అధిపతి లేవనెత్తిన ఆందోళనలపై అత్యవసరంగా చర్య తీసుకోవాలి.
- మీడియాతో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు చెందిన ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్ కూలిపోయాయో చెప్పాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ఇటీవలి నాలుగు రోజుల పాటు జరిగిన ఇండో-పాకిస్తాన్ ఆపరేషన్‌లో ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాల కూల్చివేతలో జరిగిన నష్టాలకు సంబంధించి భారత ప్రభుత్వం పారదర్శకంగా వివరాలు అందించాలన్నారు.యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయా అనే ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.ఆపరేషన్‌లో రాఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్ అనిల్ చౌహన్ మాత్రం స్పష్టం చేశారని తెలిపారు.భారత ప్రభుత్వం ఇకనైనా దీన్ని నిరాకరించడం మానుకోవాలని సూచించారు.ఇదే విషయాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని గుర్తుచేశారు.అలాగే చైనా, పాకిస్థాన్‌తో ముప్పు నేపథ్యంలో భారత్ భద్రతను పటిష్టం చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. శనివారం న్యూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత ఎయిర్‌ఫోర్స్ విజయాలపై తాము గర్విస్తున్నామని కొనియాడారు.మన సైనికులు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించారని, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారని ప్రశంసించారు.కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ప్రశ్నించారు.ఫైటర్ విమానాలు, ఆయుధాలను అందించడంలో ఆలస్యం అవుతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బూమ్‌బర్గ్ ఛానెల్‌లో భారత సీడీఎస్ ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తుచేశారు. 42 ఫైటర్ విమానాలు మంజూరైతే… మన వద్ద కేవలం 31 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. తేలికపాటి యుద్ధ విమానాలను సప్లై చేయడంలో హెచ్ఏఎల్ ఆలస్యం చేస్తోందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమస్యను అత్యవసరంగాపరిష్కరించాలన్నారు. ఆపరేషన్, ఆర్ అండ్‌డీ విభాగాల్లోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదనీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.