Take a fresh look at your lifestyle.

హెల్త్ వీక్ కార్యక్రమానికి శ్రీకారం – ‘ఈట్ రైట్ – వాక్’తో అవగాహన ర్యాలీ

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లాలో హెల్త్ వీక్ కార్యక్రమాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుండి వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేఫ్టీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఈట్ రైట్ – వాక్’ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అధికారులు పాల్గొన్న ఈ ర్యాలీ అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలంటే సరైన ఆహారపు అలవాట్లు అత్యంత అవసరమని తెలిపారు. తాజా కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు, ప్రోటీన్ పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. అధిక నూనె, ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ఇంటివద్ద తయారైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, వ్యాయామం చేయడం వంటి మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

హెల్త్ వీక్‌లో భాగంగా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారిని సత్కరించనున్నారు. ఏప్రిల్ 8న రక్షిత మాతృత్వ దినోత్సవం, ఏప్రిల్ 9న ఎయిడ్స్ నియంత్రణపై ‘రెడ్ రన్’, ఏప్రిల్ 10న ఆయుష్ మరియు హోమియోపతి దినోత్సవం సందర్భంగా యోగా, ఆరోగ్య శిబిరాలు, ఏప్రిల్ 11న మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీలత, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.