కోరుట్ల, ముద్ర;
హనుమాన్ జయంతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాడవాడల హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని జవహర్ రోడ్ లో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు పాలేపు రాము శర్మ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, గణపతి ఆరాధన, స్వస్తి పుణ్యా వచనం, ఆంజనేయ స్వామి ఫల పంచామృత అభిషేకం, సహస్రనామాలతో పుష్పార్చన, తమలపాకులు వడలతో అభిషేకించారు. మహా హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం మహిళలు సామూహిక హనుమాన్ చాలీసా, దండక పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జయంతి సందర్భంగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వహణ కమిటీ తగిన ఏర్పాట్లను చేశారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనుప్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాటికొండ ఆంజనేయులు, అల్లాడి ప్రవీణ్, చిద్రాల వినోద్, గరిపెల్లి శ్రీనివాస్, కంటాల భాస్కర్, కొండూరి శ్రీధర్, ఏనుగందుల శ్రీనివాస్ గుడిసె కోటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.