- స్లాబ్ లను తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు.
- కూల్చివేతలను పరిశీలించిన కమిషనర్.
- పరిమితికి మించి నిర్మాణాలు చేపడితే కూల్చివేతలే.
- మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో వెలిసిన పలు అక్రమ నిర్మాణాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ సమక్షంలో బుధవారం కూల్చివేశారు.ఆదిభట్ల మున్సిపల్ కేంద్రంలోని టీసీఎస్ సమీపంలో, మంగళపల్లిలో అనుమతించిన దానికంటే పరిమితికి మించి నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణాలను అధికారులు సిబ్బందితో కూల్చి వేతలు చేపట్టారు ఆదిభట్ల, మంగళపల్లి లలో బిల్డర్లు గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు ఫ్లోర్ ల నిర్మాణాలకు అనుమతులు తీసుకొని అదనంగా మరో రెండు ఫ్లోర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే సదరు బిల్డర్లకు నోటీసులు అందజేశారు.అయినప్పటికీ వాటిని బేఖాతలు చేస్తూ బిల్డర్లు అదనపు ఫ్లోర్ల నిర్మాణాలకు పూనుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు ఆయా నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. జేసీబీలు, డ్రిల్లర్ల సాయంతో అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు ఫ్లోర్ల స్లాబ్ లను కూల్చివేశారు. ఆదిభట్లలో టీసీఎస్ సంస్థతో పాటు మంగళపల్లిలో పలు ఇంజనీరింగ్ కళాశాల ఉండడంతో ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టి హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు ఇదేవిధంగా స్లాబ్లను కూల్చివేసినప్పటికీ సదరు బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.
- పరిమితికి మించి నిర్మాణాలు చేపడితే కూల్చివేతలే.
- మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ.
మున్సిపాలిటీ పరిధిలో పరిమితికి మించి నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ స్పష్టం చేశారు.మంగళ్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ఆదిభట్ల టీసీఎస్ సమీపంలో, మంగళపల్లిలో పరిమితికి మించి నిర్మాణాలు చేపడుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. గతంలో బిల్డర్ లకు నోటీసులు ఇవ్వడంతో పాటు సిబ్బందితో నేరుగా హెచ్చరించినట్లు వివరించారు. వారు తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో సిబ్బందితో కలిసి కూల్చివేతలకు దిగినట్లు చెప్పారు.అనుమతులు మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
