ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించం
గంజాయి స్మగ్లర్లను ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఎదుర్కొంది
సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇకపై స్మగ్లర్లకు ధీటైన సమాధానం చెప్పేలా ఎక్సైజ్ అధికారులకు త్వరలోనే ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించి స్మగ్లర్ల దాడిలో గాయపడి.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను మంత్రి సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సౌమ్య కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే వైద్యులు, సౌమ్య కుటుంబ సభ్యులు, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించినట్లు గుర్తుకు చేశారు. కానిస్టేబుల్ సౌమ్యకు చికిత్స కొనసాగుతోందదన్న మంత్రి ఆమె కిడ్నీని వైద్యులు తొలగించారన్నారు. మరో కిడ్నీకి డయాలసిస్ జరుగుతోందని చెప్పారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సౌమ్య చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం వేట కొనసాగుతుందని వెల్లడించారు. ఇలాంటి సంఘనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణ, అక్రమ రవాణా, అమ్మ కాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచి, దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
2,457 మందిపై ఎఫ్ఐఆర్‌లు..
ఎక్సైజ్ శాఖ పరిధిలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,354 కేసులు నమోదు చేసి 2,457 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. 5,196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోనే 110 మందిపై 70 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తెలిపారు. కొన్ని సందర్భాల్లో గంజాయి,ఇతర మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు ఎక్సైజ్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు కూడా ఆయుధాలు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశం పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం వారి వెంట నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషి, నిజామాబాద్, మెదక్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు సోమిరెడ్డి, హరికిషన్ పాల్గొన్నారు.