Take a fresh look at your lifestyle.

రైలు కింద పడి తల్లి,ఇద్దరు పిల్లల ఆత్మహత్య..

 

చర్లపల్లిలో విషాదం…

ముద్ర,మేడ్చల్:

ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం ఉన్నా… ఎందుకు బ్రతకలేకపోయారన్న ప్రశ్నలకు సమాధానం లేకుండా ఈ ఘటన అందరినీ కలచివేసింది.
బోడుప్పల్‌ చెంగిచర్ల హరిత వనం కాలనీ కి చెందిన విజయ శాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చేతన రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (16) శనివారం తెల్లవారుజామున చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురిని గమనించిన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. విజయ శాంతి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తుండగా, కుమార్తె చేతన చైతన్య కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమారుడు విశాల్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం… ఈ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అల్లుడు సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
రైల్వే పోలీసులకు లభించిన సూసైడ్ నోట్ లో “బ్రతకాలని లేదు… అందుకే ఈ నిర్ణయం” అంటూ రాసి ఉండటం కలచివేసింది. ఎలాంటి స్పష్టమైన కారణాలు లేని ఈ ఉత్తరం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave A Reply

Your email address will not be published.