జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలి
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి
జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలు… ఆరు చెక్ పోస్టులు
ముద్ర, నారాయణ పేట :
వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం వీసి సమావేశ మందిరంలో జిల్లా సంబంధిత శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్ణీత మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం క్వింటాలు గ్రేడ్ –ఏ రకానికి 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 369 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొంత ఎతైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు భద్ర పరుచుటకు సరిపడా ఏర్పాట్లు చేయాలని, నిబంధనల ప్రకారం రైతులకు గోనె సంచులు ఇవ్వాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ, మూత్రశాలలు, విద్యుత్, టేబుల్, కుర్చీలు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రములో ఖచ్చితముగా 2 ఎలక్ట్రానిక్ తూకం పరికరాలు, 30 టార్పాలిన్లు, 1 ప్యాడి క్లీనర్ అందుబాటులో ఉంచాలని, ఒకవేళ ప్యాడి క్లీనర్ లేనిచో ట్రాక్టర్ మౌంటెడ్ ఫ్యాన్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతుల వద్ద నుండి వరుస ప్రకారం కొనుగోలు చేయాలని, రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని తెలిపారు. రైతులు ధాన్యం తీసుకొని వచ్చినపుడు తేమ శాతం 17 శాతం కంటే ఎక్కువ ఉంటే, ధాన్యం ఆరబెట్టుకొని తేమ శాతం తగ్గిన తర్వాతనే ధాన్యం తీసుకొని రావాలని రైతులకు అవగాహన కల్పించాలని, రైతులు ధాన్యం తీసుకొని వచ్చినపుడు వారి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం నకలు ప్రతులను తీసుకోవాలని, వ్యవసాయ విస్తరణ అధికారి జారీ చేసిన టోకెన్ తో ఓ పి ఎం ఎస్ లో వివరాలు సరి చూసుకోవాలని, కౌలు రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా “కౌలు రైతు ధ్రువీకరణ పత్రం” ఖచ్చితముగా సమర్పించాలని తెలిపారు. ప్రతి సన్న రకం ధాన్యం సంచి పై S అక్షరం, సెంటర్ కోడ్ ఎరుపు రంగుతో ఖచ్చితముగా వ్రాసిన తర్వాతనే ధాన్యం నింపాలని, బస్తాలను ఎరుపు రంగు దారంతో కుట్టాలని, దొడ్డు రకం ధాన్యం బస్తాలను ఆకుపచ్చ రంగు దారంతో కుట్టాలని, ఈ సంచులపై ఎటువంటి అక్షరాలు వ్రాయకూడదని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పూర్తి భాద్యత కొనుగోలు నిర్వాహకులదేనని, కొనుగోలు జరిపిన వెంటనే సంబoదిత రైతుకు కొనుగోలు పత్రం తూకం వివరాలతో ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు కొనుగోలు రిజిస్టర్ లో నమోదు చేసి ట్యాబ్ నందు వివరాలు నమోదు చేయాలని, ట్రక్ చిట్ లో వ్రాసిన రైతుల ప్రకారమే మిల్లులకు ధాన్యం సరఫరాలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ఐకెపి 82, పిఎసిఎస్ 65, మెప్మా 5, ఎఫ్ పి ఓ ఏడు, ఎఎంసి ఒకటి మొత్తం 160 కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆరు చెక్ పోస్టులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, డి.ఎస్.పి.లింగయ్య తదితరులు పాల్గొన్నారు.