- తెలుగు వర్సిటీ కొత్తలోగా ఆవిష్కరణ.
- రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ పోరాట సామాజిక స్ఫూర్తి ప్రధాత సురవరం ప్రతాప రెడ్డి అని, అంత గొప్ప వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో సురవరం ప్రతాప రెడ్డి 129వ జయంతి సభకు చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నూతన లోగోను చిన్నారెడ్డి ఆవిష్కరించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి పేరు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు యూనివర్సిటీకి పెట్టాల్సిందని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటి గొప్ప వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం చారిత్రాత్మకమని అన్నారు. కవి, రచయిత, ప్రముఖ సంపాదకులు, సామాజికవేత్త, ఎమ్మెల్యేగా ఇలా అనేక రంగాల్లో సురవరం ప్రతాపరెడ్డి చేసిన సేవలు అజరామరం అని చిన్నారెడ్డి పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రంథాలయాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే సురవరం శతాబ్దం క్రితం వేసిన పునాదే కారణం అని చిన్నారెడ్డి తెలిపారు. రెడ్డి హాస్టల్స్ నిర్వహించడమే కాకుండా ఇతర సామాజిక వర్గాల హాస్టల్స్ ఏర్పాటుకు తోడ్పాటును అందించిన మహనీయులు సురవరం అని, దళితులు, ఇతర వర్గాల అభ్యున్నతి కోసం సురవరం పాటు పడ్డారని చిన్నారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, తెలంగాణ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానంద రావు, అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మూర్తి, ప్రముఖ కవి, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, సురవరం ప్రతాపరెడ్డి కుమారులు సురవరం విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
