కరీంనగర్ కార్పొరేషన్ గెలుపును తట్టుకోలేకపోతున్న
66 డివిజన్లలో 31 గెలిచాం
ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారు
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచినా బీజేపీ గెలుపును అడ్డుకోలేకపోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లోని చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారన్న కేంద్రమంత్రి… ఎంఐఎం బాస్ అసదొద్దీన్ కూడా వచ్చి వెళ్లారన్నారు. మహామహులు ప్రచారం చేసినా కార్పొరేషన్ ను టచ్ చేయలేకపోయారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం పట్టలేని సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపైనే పోరాటం చేశామన్న ఆయన విజయం సాధించామని చెప్పారు. కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లలో 31 గెలిచామనీ మద్దతు ఇవ్వడానికి మరో ముగ్గురు ఇండిపెండెంట్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అభివృద్ధి కోసం మీతో కలిసి వస్తామని మరో ముగ్గురు తమను సంప్రదించారని చెప్పారు. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కరీంనగర్‌ను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ తెలిపారు.