Take a fresh look at your lifestyle.

టెక్స్ టైల్ పార్క్ భూమిని అమ్ముకునే యత్నం

  • చిరు వ్యాపారులను నిలువునా ముంచిన కేటుగాళ్లు.

ముద్ర న్యూస్ బ్యూరో
హైదరాబాద్: పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగినట్టుగా ఓ సంస్థకు చెందిన చైర్మన్, డైరెక్టర్లు సభ్యులను నిండా ముంచారు.పేద, మధ్య తరగతికి చెందిన వంద మందికి పైగా చిన్న చిన్న వస్త్ర వ్యాపారులు పొదుపు చేసి భూమిని కొనుగోలు చేసి హైదరాబాద్ హైటెక్ టెక్స్ టైల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఏర్పడితే సంస్థ చైర్మన్, డైరెక్టర్లు వారిని నిలువునా ముంచారు. తాము ఎన్నుకున్న చైర్మన్, డైరెక్టర్లు నయవంచనకు పాల్పడి తమను మోసం చేసి వందలకోట్ల విలువజేసే భూమిని అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు.మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ హైటెక్ టెక్స్ టైల్ పార్క్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఎం.సురేంద్ర, గజం శ్రీరాములు, అడ్డకట్ట పురుషోత్తం, వెంకటరమణ,ఉప్పల శంకరయ్య ఇంజమూరి శ్రీనివాసరావు, వి.రమేష్, జి.బలరాం, దేవరాస్, రవి తదితరులు మాట్లాడుతూ తమ గోడు వెళ్ళబోసుకున్నారు.టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కోసం 22 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొల్లూరు మండలం చేగూరులో 142 ఎకరాల భూమిని సుమారు రూ.7.9 కోట్లను వెచ్చించి రైతులు వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పారు. విడివిడిగా రిజిస్ట్రేషన్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు రావని చెప్పిన డైరెక్టర్లు హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు.కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చిన సబ్సిడీ గ్రాంట్ లకు సరైన చెక్కులు చూపకపోవడంతో ఆ మొత్తం ప్రోజెక్టు ను కేంద్రం రద్దు చేసి,12 ఎకరాల భూమిని నిషేదిత జాబితాలో చేర్చిందని వివరించారు.ఈ నేపథ్యంలో ఉప్పల నర్సయ్య, ఘనాశ్యాం సరోడె తమకు తెలియకుండానే 142 ఎకరాల భూమిని విక్రయించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తనుకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.