- పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి గాయబ్
- పార్టీ కార్యక్రమాలకూ దూరమే
- ఎమ్మెల్యేలతో వైరం
- ఉండీ లేనట్టుగానే పదవులు
- అసంతృప్తిని తగ్గించేందుకు ముందుగా కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ
- అయినా తగ్గని అసంతృప్తి
- చైర్మన్ల పనితీరుపై సీఎంకు నివేదిక
ముద్ర, తెలంగాణ బ్యూరో :పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చిపడింది. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు, విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న సర్కార్ సొంత పార్టీకి చెందిన కీలక నేతలతోనూ ఇబ్బందులు పడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కీలక నేతలకు పార్టీ.. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించింది. అయితే బాధ్యతలు చేపట్టిన చైర్మన్లలో ఎవరూ ప్రజాక్షేత్రంలో కానరావడం లేదు. బాద్యతలు చేపట్టిన మరుసటి రోజే సగానికిపైగా మంది మాయమైపోయారు. చాలా మంది చైర్మన్లు పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉండడం అగ్రనేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.
మంత్రులు, కీలక నేతలకు సాన్నిహిత్యంగా ఉంటూ పదవులు దక్కించుకున్న పలువురు తమ రూటు మార్చుకున్నారు. పదవులు చేపట్టిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పని చేయాల్సిన కొందరు వారితో విభేదాలు పెంచుకుంటున్నారు. కీలక శాఖలకు చైర్మన్లుగా వ్యవహరిస్తోన్న చాలా మంది అసలు పార్టీ. పదవుల్లో ఉండీలేనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతోన్న బీజేపీ, ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు దిగుతోన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాల్సిన చైర్మన్లు పత్తాలేకుండాపోయారు. వారి పని తీరు, ప్రతిపక్షాల విమర్శలపై వారు స్పందిస్తున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని గుర్తించిన అగ్రనాయకత్వం కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై అసంతృప్తితో ఉంది. రాష్ట్రంలో 40 మంది పైగా కార్పొరేషన్ చైర్మన్, కమిషన్ల చైర్మన్‌లను నియమించారు. వీరి నియామకం లోక్‌సభ ఎన్నికలకు ముందే జరిగినా.. ఎన్నికల తరువాత అమల్లోకి వచ్చాయి. వీరు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలకుపైగా గడిచినా వేళ్ల మీద లెక్కపెట్టే వారు మినహా, మిగిలిన వారు ఆశించినంతగా పని చేయడంలేదని తేలింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం చేరింది.
యాక్టివ్ గా లేరు..
ప్రతిపక్షం అధికార పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, సీఎంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నా కమిషన్ చైర్మన్లు స్పందించడం లేదని నాయకత్వం గుర్తించింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ తమకు పదవులు వచ్చాయనే అభిప్రాయంతో ఉన్న పలువురు పార్టీయేతర కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు తేలింది. కమిషన్ల చైర్మన్‌లు, సభ్యులు రాజకీయంగా స్పందించడానికి వీలు లేదు. దీంతో వారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేలా పనిచేస్తున్నారని సీఎం నోటీసుకు వచ్చింది. కానీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం, టీపీసీసీ చీఫ్ గుర్తించారు. వారి ఆదేశాలతో పలువురు చైర్మన్లతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇది వరకే ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వచ్చేలా ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చైర్మన్లు చేసిన తప్పిదాలు,కుంభకోణాలను వెలికి తీసి ప్రజలకు వివరించాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా.. ఎవరూ స్పందించడం లేదనే అసంతృప్తితో అధికార పార్టీ పెద్దలు ఉన్నారు. గతంలోని చైర్మన్లు ఇష్టారీతిన ఖర్చులు చేసి కోట్ల రూపాయలను నిధులను డ్రా చేశారు. వ్యక్తిగత సిబ్బంది నియామకం, కార్పొరేషన్‌ద్వారా కేటాయింపులు తదితర వాటిని గుర్తించవచ్చని చెప్పినా? ఎవరూ స్పందించడం లేదని తేలింది. కొందరైతే కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారా ? అని కూడా తెలియనంతగా బలహీనపడ్డారు. ఎక్కడా పర్యటించకుండా, సమీక్షలు చేయకుండా కార్పొరేషన్‌పై కనీస అవగాహన కూడా లేకుండా ఉన్నారు.
మిగిలిన పోస్టుల భర్తీ జాప్యానికి కారణమిదే
రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జరుగుతోన్న జాప్యానికి ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ల పనితీరే కారణమనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పదవులు ఇచ్చిన వారు చురుగ్గా, ఉత్సాహంగా స్పందించి ఉంటే మిగిలిన పోస్టులను త్వరగా భర్తీచేసేవారని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు పదవులు వచ్చిన పలువురు మాత్రం తాము గల్లీ లీడర్లు గానే ప్రవర్తిస్తున్నట్లు నాయకత్వం గుర్తించింది. ఇప్పటికే ఏడు నెలల పదవీ కాలం ముగిసినందున మరో సంవత్సరన్నరలో వీరి పదవి ముగియనుంది. ఆ తర్వాత వీరికి ఎవ్వరికి కూడా రెన్యూవల్ ఉండదనే పార్టీ పెద్దలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదీలావుంటే.. ఏళ్ల నుంచి పార్టీలో కొనసాగుతూ కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాము పార్టీ కోసం ఎంత కష్టపడినా పదవి రాలేదనే మనోవేదనకు గురవుతున్నారు. అందుకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు చేస్తోన్న ఆరోపణలు, ప్రజల్లో ఉన్న అపోహాలు తొలిగించడంలో ఆసక్తి చూపడం లేదు. ఏరి కోరి పార్టీ పదవులు కట్టబెట్టిన కార్పొరేషన్ చైర్మన్లే స్పందించాలనే అభిప్రాయం తమ అనుచరుల ముందు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.