Take a fresh look at your lifestyle.

‘ప్రైవేట్’ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో సర్కార్ విఫలం-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఫీజుల నియంత్రణ చట్టం ఈ నెలలోనే తేవాలి
ఫీజు పెంచొద్దంటూ జీవో జారీ చేయాలి
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై స్పందించాలి
ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం
మాట తప్పితే అమరవీరుల స్థూపం వద్ద రాళ్లతో కొట్టండి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టటంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందని టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. ఫీజుల దోపిడీ నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తేవాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ అనే అంశంపై బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆమె మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కే కుట్రలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్య సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మన విద్యాశాఖ మంత్రి కావటం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంపు లేకుండా జీవో జారీ చేయాలన్నారు. ఫీజుల పెంపు కారణంగా తల్లితండ్రులకు మే నెల పీడకల మాదిరిగా తయారైందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం కోసమే 60 నుంచి 70 శాతం వరకు వారి ఆదాయాన్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ పిల్లలను బాగా చదివించాలన్న తల్లితండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ సంస్థలు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ స్కూల్ లో దాదాపు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని చెప్పారు. తాము కొత్తగా ఏమీ అడగటం లేదని…రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఇచ్చిన హామీలనే అడుగుతున్నామన్నారు.

తిరుపతి రావు కమిషన్ నివేదికను విస్మరించిన బీఆర్ఎస్
సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక సంవేదనతో పాలన చేయాల్సి ఉండేనని చెప్పారు. కానీ ఆ పని జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ కోసం తిరుపతి రావు కమిషన్ వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం…ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం అందించడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తే వాటిని ఉచితంగా అందించడం సాధ్యమేనని చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ బాధ్యత నుండి తప్పుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో కూడా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇచ్చిన మాటను తప్పితే అమరుల స్థూపం స్తంభానికి క్టటేసి రాళ్లతో కొట్టాలన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ ను బొందపెట్టే జీవో నం.7
ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టకపోగా…ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా బొందపెట్టే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తోందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంఎస్-7 జీవో తో ఫీజు రీయింబర్స్ మెంట్ కు మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పిల్లల అకౌంట్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వేస్తామంటూ జీవో లో పేర్కొన్నారని కవిత చెప్పారు. ఫీజు అకౌంట్ లో వేయకపోయిన సరే పిల్లల తల్లితండ్రులు ఉద్యమం చేయరన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనిచేస్తుందన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. బకాయిలు చెల్లించకపోవటంతో కాలేజ్ లు మాతపడుతున్నాయన్నారు. పైగా చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోతే అధికంగా నష్టపోయేది ఆడపిల్లలేనని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల భారం ఎక్కువైతే కొడుకుల కంటే ముందు కూతుళ్లనే చదువు మాన్పించే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఆడబిడ్డల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.