జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి
కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం
ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం
సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం ఎమ్మెల్యేలం,చైర్మన్ అందరం పర్యవేక్షిస్తుంటే మీ కళ్లు మూసుకున్నారా
అన్నిటినీ రాజకీయ కోణంలోనే చూస్తారా, విలువైన సూచనలు చేయరా..
కేటిఆర్ మాటలను తీవ్రంగా ఖండించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సుడా చైర్మన్ కోమటిరెడ్డి

ముద్ర, కరీంనగర్, :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
స్థానిక ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై బాధ్యతతో స్పందించాల్సిన కేటీఆర్, రాజకీయ విమర్శలకే పరిమితమై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కరీంనగర్‌కు వచ్చి అనవసర ఆరోపణలు చేయడం సరికాదని, సంఘటన జరిగిన వెంటనే తాము ఎమ్మెల్యేలుగా, చైర్మన్‌గా ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కూడా కేటీఆర్ విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.

జువెల్లరీ దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, దోషులను త్వరితగతిన పట్టుకుని శిక్షించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇలాంటి ఘటనలపై విలువైన సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, అప్పట్లో తాము రాజకీయాలు చేయకుండా న్యాయం కోసం మాత్రమే మాట్లాడామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వూట్కూరి వెంకటరమణ రెడ్డి, మోరపల్లి రమణరెడ్డి, పులి కృష్ణా, తిరుపతి రెడ్డి, కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.