గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనం
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం ఉదయం 6 గంటలకే ఊర్కొండ మండల పరిధిలోని ఉరుకొండపేట, ముచ్చర్లపల్లి గ్రామాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, పురోగతి, నాణ్యత, ప్రభుత్వ నిబంధనల అమలుపై అధికారులను ప్రశ్నించారు.
ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులను దశల వారీగా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, చెత్త నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని, చెత్త పేరుకుపోకుండా క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచాలని అన్నారు.

ముచ్చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌కు గ్రామస్తులు పలు సమస్యలను వివరించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల లోపం, మరమ్మత్తుల అవసరంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు గ్రామ సందర్శనలో భాగంగా ఉరుకొండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం ను కలెక్టర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, పిడి హౌసింగ్ సంగప్ప, తహసీల్దార్ యూసుఫ్ అలీ, ఎంపీడీవో, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.