ఈవీఎం గోడౌన్‌ను సమగ్రంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమగ్రంగా పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను అధికారికంగా తెరిచి, అందులో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు తదితర ఎన్నికల సామాగ్రిని గదుల వారీగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సామాగ్రి రవాణా, నిల్వ, భద్రత అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ పరిసరాల్లో సీసీటీవీ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు పరికరాల మెయింటెనెన్స్‌ను సకాలంలో నిర్వహించాలని సూచించారు.

అదేవిధంగా 24 గంటల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని, సిబ్బంది నియామకం, పర్యవేక్షణ వ్యవస్థలు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవీఎంల భద్రతలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి చెందిన నాగేంద్ర గౌడ్, బీఆర్ఎస్‌కు చెందిన వెంకటయ్య, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఎం.డి. హుస్సేన్, బీఎస్పీకి చెందిన రామకృష్ణ, సిపిఐ ప్రతినిధి శివశంకర్, టిడిపి నాయకుడు బాలకృష్ణతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల సేవలో నిర్లక్ష్యం అస్సలు సహించబోము – సమయపాలన తప్పనిసరి
ట్రెజరీ కార్యాలయంలో ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం – గైర్హాజరు సిబ్బందికి నోటీసులు

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. ప్రజల సేవలో నిర్లక్ష్యం, ఆలస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
మంగళవారం ఉదయం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని పలు శాఖలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఉదయం 10:38 గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించగా, ఆ సమయానికి కూడా సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం ఆయన దృష్టికి వచ్చింది. కొంతమంది సిబ్బంది గైర్హాజరు ఉండగా, పెన్షనర్లు మరియు ఇతర పిటిషనర్లు కార్యాలయంలో వేచి ఉండటం కలెక్టర్ గమనించారు.
ఈ పరిస్థితిపై ట్రెజరీ అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజలకు సేవలు అందించడానికి ఉన్న కార్యాలయాల్లో ప్రజలే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు?” అని అధికారులను ప్రశ్నించారు. సిబ్బంది ఆలస్యంగా హాజరవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను వివరణ కోరారు.
ట్రెజరీ అధికారి సెలవులో ఉన్నప్పటికీ, సిబ్బంది పర్యవేక్షణలో లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఉదయం 10:30 గంటలలోపు ప్రతి అధికారి, సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, సమయానికి హాజరు కాని సిబ్బందికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
పెన్షనర్లు, ఇతర ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించి సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు.
ప్రతి శాఖలో క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, బాధ్యతారహిత వైఖరిని అస్సలు సహించబోమని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.