తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ బ్రాండ్
రాష్ట్రంలో మూడు ఎకనమిక్ జోన్లు
కోటి కుటుంబాలకు సన్న బియ్యం
సన్న వడ్లకు బోనస్.. ధాన్యం కొనుగోళ్లలో రికార్డు
62 వేల మందికి ఉద్యోగాలు
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని, ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించి, కీలక రంగాలకు ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో 77వ గణతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్చ్‌ఫాస్ట్, శకటాల ప్రదర్శన, కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రసంగించిన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదు… మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, వైవిధ్యంలో ఐక్యతను సాధించాలనే గురుతర బాధ్యతను గుర్తు చేసే పవిత్ర దినం అంటూ అభివర్ణించారు. ఇది భారత ఆత్మను ప్రతిబింబించే జాతీయ పండుగని కొనియాడారు. “మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా పాలనను అందించడానికి ఇది మార్గ నిర్దేశం చేస్తుంది. ఈ పవిత్ర దినాన… న్యాయం, సమానత్వం, సోదరభావం వంటి విలువలను మరింత పరిరక్షించడానికి పునరంకితమవుతూ ముందుకు సాగాలి. ఇవే ఒక బలమైన దేశానికి మూల స్థంభాలు.” అని పిలుపునిచ్చారు.
గణనీయ విజయాలు సాధించాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గణనీయమైన విజయాలను సాధించి ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను సంపాదించిందని, రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ అనే దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించిందని, దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించిందని వెల్లడించారు.
‘వికసిత్ భారత్’ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న టార్గెట్ పెట్టుకున్నట్టు గవర్నర్ వెల్లడించారు. దీని కోసం గత డిసెంబరులో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రతినిధుల మధ్య తెలంగాణ రైజింగ్ -2047 దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించామని తెలిపారు.

మూడు ప్రాంతాల వారీగా అభివృద్ధి
రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచారు. అందులో మొదటిది కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పేరుతో హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి, కాలుష్యాన్ని తగ్గిస్తూ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాల్సి ఉంటుందని అన్నారు. రెండోది పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ పేరుతో ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని తయారీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ పేరుతో రీజినల్ రింగ్ రోడ్‌కు బయట ఉన్న రాష్ట్రంలోని ఇతర గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ దార్శనిక పత్రంలోని లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టిందని, ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సమతుల్య, సమానమైన, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు.
మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు ప్రణాళికలు
తెలంగాణ రైజింగ్–2047 ప్రణాళిక ద్వారా గాంధీ సరోవర్ ప్రాజెక్టు(బాపూఘాట్), గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, రెండో దశ మెట్రో రైలు, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్లను నిర్మించనున్నట్టు గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. ఇవన్నీ 2047 నాటికి తెలంగాణను దేశ పురోగతిలో కీలక పాత్రధారిగా నిలబెడతాయని ఆకాంక్షించారు.
సంస్కృతి, సంప్రదాయాలు, సంక్షేమం
తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని కూడా గవర్నర్ తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటూ, 2025లో జిల్లా కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించామని వెల్లడించారు. అంధెశ్రీ రచించిన “జయ జయ హే తెలంగాణ”ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామన్నారు. గిరిజన గ్రామమైన మేడారంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు శాశ్వత మౌలిక వసతుల కోసం రూ.251 కోట్లను మంజూరు చేశామన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. “వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తోంది. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేసి రూ.20,617 కోట్ల వ్యయంతో సుమారు 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేశాం. రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి అందించే సహాయాన్ని గత సంవత్సరం రూ.10,000 నుంచి రూ.12,000కు పెంచి సాగు పెట్టుబడిని అందిస్తోంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సన్న ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా అందిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 14.24 లక్షల మంది రైతుల నుంచి సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటివరకు రూ.17,079.50 కోట్ల చెల్లించాం. అదనంగా రూ.1,453 కోట్లను బోనస్ సబ్సిడీ అందించాం. ఈ విధానాలతో తెలంగాణ దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఉనికి చాటింది. రైతుల ఆర్థికాభివృద్ధికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతలు, మట్టిసార నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు లక్ష్యంగా ఫార్మర్ కమిషన్‌ను తొలిసారిగా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉత్పాదకత పెరిగి, రుణ బాధలు తగ్గనున్నాయి.” అని గవర్నర్ వెల్లడించారు.సమస్యలతో నిండిన ధరణి పోర్టల్ స్థానంలో రైతులకు అనుకూలమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. దీని ద్వారా దీర్ఘకాలిక భూవివాదాలకు పరిష్కారం లభించినట్టు వెల్లడించారు.
62 వేల ఉద్యోగాలు
చాలా కాలం తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్-I, II, III, IV నియామకాలు పూర్తి అయినట్టు గవర్నర్ వెల్లడించారు. ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 62,749 ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ప్రారంభించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,22,337 మంది నమోదు కాగా, 1,892 వివిధ కంపెనీల యజమానులు ఇందులో చేరినట్టు తెలిపారు. యువతకు ఉపాధి నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా పాఠశాల, ఉన్నత విద్య రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టామన్నారు. ఫ్యూచర్ సిటీలో సమగ్ర క్రీడా కేంద్రంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. “ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రైవేట్ సంస్థలతో పోటీ పడేలా చర్యలు చేపట్టింది. సమర్థమైన విద్యా విధానాల రూపకల్పన కోసం ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. మెస్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించిందన్నారు.
కాగా, శాసన సభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ పాల్గొన్నారు. అనంతరం శాసన మండలి ప్రాణంలో కూడా చైర్మన్ గుత్తా జాతీయ జెండాను ఎగరేశారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.