99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు విస్తరణపై అవగాహన
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా “ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం” అంశాలపై అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచే దిశగా పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా నీటి సంరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులకు ఈ సదుపాయాలను అందజేసి ఆధునిక వ్యవసాయానికి మార్గం సుగమం చేశామని తెలిపారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా బలపడే వరకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను కూడా చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, రైతులు, ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.