Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో గుండాయిజం రాజ్యమేలుతోందా..?

 

– “ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదు”
– పోలీసు స్టేషన్‌లోనే సర్ధార్ రవీందర్ సింగ్ ఫైర్
– “కార్యాలయాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?”
– నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

ముద్ర, కరీంనగర్ :

కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతో కార్యాలయాలపై దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.

“తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎంత పెద్ద రాజకీయ విభేదాలు ఉన్నా పార్టీలు పరస్పరం విమర్శించుకునేవి తప్ప, కార్యాలయాలపై దాడులు చేయాలని మేమెప్పుడూ ప్రోత్సహించలేదు” అని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పుడు కరీంనగర్‌లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే గుండాయిజం, రౌడీయిజం పెరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా పోలీసులను సూటిగా ప్రశ్నించిన ఆయన… “ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారు..? సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుంది..? కార్యాలయాలపై దాడులు చేసి, కార్లు ధ్వంసం చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోవాలా..?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించిన రవీందర్ సింగ్, కరీంనగర్ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలను ప్రజలు సహించరన్నారు. “ఇది కేవలం ఒక పార్టీపై దాడి కాదు… ప్రజాస్వామ్యంపై దాడి” అని వ్యాఖ్యానించారు.

 

పక్కా వీడియో సాక్షాలతో పోలీస్ స్టేషన్ కు బయలుదేరి
దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన ఆయన, చట్టం అందరికీ సమానమైతే కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. “నిందితులను రక్షించే ప్రయత్నాలు జరిగితే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చట్టపరంగా పోరాటం చేస్తాం” అని హెచ్చరించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడరని, ఉద్యమాల నుంచి వచ్చిన వారిని దాడులతో ఆపలేరని స్పష్టం చేసిన రవీందర్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కరీంనగర్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.