రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహించేలా ఘనంగా నిర్వహిద్దాం..
విజయవంతానికి అందరూ సహకరించాలి..
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం..
చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, మేడిపల్లి సత్యం..
జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు కృషి చేస్తాం..
మహనీయుల జీవిత చరిత్రపై పాఠశాలల్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తాం..
దళిత సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం..
దళితుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం..
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం
హాజరైన పోలీస్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ అధికారులు దళిత సంఘాల ప్రతినిధులు
ముద్ర, కరీంనగర్ :
ఏప్రిల్ 5వ తేదీన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మును పెన్నడూ జరగని విధంగా కరీంనగర్లో అత్యంత వైభవంగా జరుపుకుందామని చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల నిర్వహణలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా కృషి చేద్దామన్నారు. ఈ వేడుకలు విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.

బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల నిర్వహణపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ
లక్ష్మి కిరణ్ తో పాటు పలువురు అధికారులు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి మహనీయుల జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు.

మహనీయుల విగ్రహాల వద్ద అధికారులు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
అందరం కలిసికట్టుగా ఉంటూ రోల్ మోడల్ గా నిలిచేలా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న జరిగే గ్రామసభల్లో మహనీయుల జయంతి ఉత్సవాల విజయవంతం కోసం ప్రజలకు వివరించాలన్నారు. ఇందుకు అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. ఉత్సవాలకు హాజరయ్యే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇబ్బంది లేకుండా మహనీయులను ఘనంగా గౌరవించుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకునే మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలు కుల సంఘాల ప్రతినిధులు అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో మహనీయుల జీవిత చరిత్రపై క్విజ్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా వారి జీవిత చరిత్ర పై వీడియోలు ప్రదర్శిస్తామన్నారు. గ్రామాలు పట్టణాల్లో మహనీయుల విగ్రహాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతామన్నారు. దళితుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తిమ్మాపూర్ లో మహనీయుల విగ్రహాల ప్రారంభానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దళితులకు సంబంధించిన సమస్యలను ప్రత్యేక కేసుగా పరిగణించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2న జరిగే గ్రామసభల్లో జయంతి ఉత్సవాల విజయవంతం పై ప్రజలందరికీ అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేలా అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. దళిత సంఘాలు ప్రతినిధుల అభిప్రాయాలను అన్నింటినీ పరిగణన లోకి తీసుకొని ముందుకెళ్తామన్నారు. వారు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకొని జయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పలువురు దళిత సంఘాల నాయకులు జయంతి ఉత్సవాల నిర్వహణపై మాట్లాడారు. పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకటస్వామి, ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వై తిరుపతిరావు అధికారులు దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.