వృత్తి పోలీస్… ప్రవృత్తి పాటలు రాయడం….
పోలీస్ కళాబృందం ఇన్చార్జిగా సేవలు…
ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ తో దూసుకుపోతున్న జగిత్యాల జిల్లా వాసి…
100కు పైగా వ్రాసిన సినీ, జానపద పాటలు..
బాయిలో నా బల్లి పలికే, మామిడి కోణాల మీద పాటలతో ట్రెండింగ్…
ఏ పాట రాసిన మిలియన్ వ్యూస్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఆయన వృత్తి పోలీస్ అయినప్పటికీ, ప్రవృత్తి పాటలు రాస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. పోలీస్ కళాబృందం ఇన్‌చార్జిగా సేవలందిస్తూ, తన సృజనాత్మకతతో ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్‌ను అందిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే 100కు పైగా సినీ, జానపద గీతాలను రచించిన ఆయన, ఏ పాట రాసినా మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు కళాప్రతిభను సమన్వయం చేస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ యువకునిపై అందిస్తున్న ప్రత్యేక కథనం….
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివి రావు పేట గ్రామానికి చెందిన కమల్ ఇస్లావత్ అనే యువకుడు 2009 లో పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. అయితే ఒకవైపు పోలీస్ ఉద్యోగం చేస్తూనే, మరోవైపు తనలో దాగి ఉన్న పాటల రచయిత కలను బయట పెడుతు పలువురి ప్రశంసలను అందుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా పోలీస్ కళాబృందం ఇన్చార్జిగా క్రమశిక్షణతో కూడిన సేవలందిస్తూనే తాను పుట్టి పెరిగిన పల్లె పరిమళాలు మట్టి వాసనలను పోనివ్వకుండా అచ్చమైన తెలంగాణ పదాలతో అల్లిన పాటలను బయటపెడుతు తన కలకు పదును పెడుతున్నాడు.
పాటల ప్రయాణం సాగింది ఇలా…
కమల్ ఐదో తరగతి నుంచి 10 వరకు మొదట పాటలు పాడటంతో ప్రారంభించిన తన పాటల ప్రయాణాన్ని ఆ తర్వాత కవిత్వంతో పాటు పాటలు రాయడం హాబీగా మారింది. మొదట 2003 నుంచి తన పాటల జర్నీని ప్రారంభించిన, 2005లో కిస్మత్ అనే బంజారా పాటల ఆల్బమ్ క్యాసెట్ లో 8 పాటలు రాసి విడుదల చేసి మంచి గుర్తింపును పొందారు. ఉద్యమ సమయంలో నుంచి తెలంగాణ జానపదాలకు మంచి గుర్తింపు రావడానికి గమనించి ఫోక్ సాంగ్స్ రాయడం ప్రారంభించారు. తన పాటల ద్వారా సామాజిక సందేశాలను కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. యువతలో ఉత్సాహం నింపేలా, సంప్రదాయాలను కాపాడేలా ఆయన పాటలు ఉండటం విశేషం. పోలీస్ శాఖలో పనిచేస్తూనే కళా రంగంలో రాణించడం ద్వారా, సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నారు.
స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు పెరుగుతున్నారు.
ఏ పాట రాసిన మిలియన్ వ్యూస్…
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పాటలతో పాటు జానపద పాటలకు మంచి గుర్తింపు లభించింది. ఇదే సమయంలో 2009 నుంచి ప్రతి ఏటా బోనాలు, శివరాత్రి, బతుకమ్మ లతోపాటు ఇతర పండుగల సందర్భంగా జానపద పాటలను వ్రాసి గుర్తింపు పొందారు. ప్రముఖ సింగర్ మంగ్లీ కి సంబంధించిన ట్రెండింగ్ లో ఉన్న సుమారు 14 పాటలు కమల్ రాయడం విశేషం. ఇలా 100 నుంచి 120 వరకు పాటలు రాయగా, మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన కన్నయ్య కాదమ్మా నేను, బాయిలోన బల్లి పలికే, మామిడి కోనాల మీద వంటి పాటలు రాసి ఫోక్ సాంగ్స్ లో ఒక ట్రెండ్ ను సృష్టించారు. ఏ పాట రాసిన యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం విశేషం.
గంజాయి పై రాసిన పాటను ఆవిష్కరించిన సీఎం రేవంత్…
కమల్ ఇస్లావత్ పోలీస్ కళాబృందం ఇన్చార్జిగా ఉంటూ ఎన్నో సామాజిక రుగ్మతలపై మాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. వీటితోపాటు మద్యం, గంజాయి వంటి సామాజిక రుగ్మతలపై ఎన్నో పాటలను రాయగా గంజాయి పై రాసిన పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం విశేషం. అలాగే ఎన్నో పాటలకు అవార్డులు, రివార్డులు రావడం విశేషం.
సినిమా పాటల్లోను తనదైన ముద్ర…
కమల్ ఇస్లావత్ తను ఫోక్ సాంగ్స్ తో పాటు సినిమా పాటల ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పటివరకు జాబిల్లి కోసం ఆకాశమల్లే, కలవి వనంలో, దేవగుడి, మారెమ్మ, కొంచెం పని కొంచెం రన్, గుడ్ లక్ సఖి తదితర సినిమాల్లో పలు పాటలు రాసి గుర్తింపు పొందారు.