Take a fresh look at your lifestyle.

ఇంకెన్నాళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ? కేసీఆర్ బాటలో రేవంత్ ప్రభుత్వం

  • కాంగ్రెస్ అభయ హస్తమంటే భస్మాసుర హస్తం
  • కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రహోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ ను మించి పోయిందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేల రూపాయలు బకాయిపడ్డారని చెప్పారు. ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ.19 వేల 600 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు. ఈ డబ్బులన్నీ జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.48 వేలు, మహిళలకు రూ.30 వేల చొప్పున దాదాపు రూ.50 వేల కోట్లు రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. వృద్దులకు రూ.4 వేలు, పేదలకు ఇండ్ల జాగా, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు పేరుతో లక్ష కోట్లకుపైగా బకాయి పడిందన్నారు. ఈ సొమ్ముంతా జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు.. తెలంగాణ సహా ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీలను ఓడిస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యమని బండి సంజయ్ అన్నారు. గ్రామ పంచాయితీలకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ప్రచారంలో నిజం లేదన్నారు.

ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరుతున్నామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తోన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకోవలన్నారు. కాంగ్రెస్ అభయ హస్తమంటేనే భస్మాసుర హస్తమని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా కాంగ్రెస్ పార్టీ హామీలను ఇచ్చిందని, ఆ హామీలను అమలుచేసేంతవరకు కొట్లాడదామని ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆరోగ్య శ్రీ బకాయిలను ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించడం లేదని, దీంతో ప్రైవేటు ఆసుపత్రులలో దోపిడీకి అంతులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో రోగులు చేరితే లక్షలాది రూపాయలను బిల్లుల పేరుతో దోచుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలేవని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో తెలంగాణలో ఉత్పాదకత పెంచడానికి, ఉద్యోగాల కోసం, యువత కోసం ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలకు కప్పం కట్టడం తప్పితే ఈ ప్రభుత్వం సాధించినది ఏమీ లేదని బండి సంజయ్ విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.