- ప్రతిభ కలిగిన రాష్ట్ర నిరుద్యోగులకు అన్ని విధాల సాయం
- జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ
- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అభ్యర్ధులకు రూ. లక్ష చొప్పున సాయం
- సివిల్స్ సర్వీసెస్‌లో దేశంలోనే అత్యధికంగా ఎంపిక కావాలి
- రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలోసీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్ధానాలు సాధించే స్ధాయికి తెలంగాణ ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ స్ధాయి ప్రతిభ కలిగిన రాష్ట్ర యువతకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆదివారం మహాత్మ జ్యోతీరావు పూలే ప్రజాభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సింగరేణి సౌజన్యంతో ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రభుత్వం అందిస్తున్నది ఆర్థిక సహాయం కాదని, ప్రోత్సాహకంగా భావించాలన్నారు.గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారన్న సీఎం.. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే స్వతంత్ర భారత చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని వివరించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఏర్పడిన 14 ఏళ్లుగా గ్రూప్ 1 నిర్వహించలేదని గుర్తుచేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందుకు ఉన్న అడ్డంకులు, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు. వచ్చే మార్చి 31 లోగా గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయబోతున్నామని చెప్పారు. సాధించాలన్న పట్టుదల ఉంటేనే విజయం వరిస్తుందని, ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రేపటి భవిష్యత్తులో మీరు భాగస్వామ్యం కావాలని, అత్యధికంగా సివిల్ సర్వీసెస్ సాధించి తెలంగాణ ముందు భాగంలో నిలపాలని ఆకాంక్షించారు.సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని, సివిల్స్ సర్వీసెస్‌లో దేశంలోనే అత్యధికంగా ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలంగాణ చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఇదే వేదికగా సింగరేణి సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రతి కార్మికుడికి 1.25 కోట్ల ప్రమాద బీమా భద్రత కల్పించడానికి సంబంధించి సింగరేణి సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమయంలో సింగరేణి చైర్మన్, సీఎండీ బలరాం నాయక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
గ్రీన్ పవర్ వైపు ప్రపంచం మొగ్గు : భట్టి
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ పవర్ వైపు మొగ్గు చూపుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంపు స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని వివరించారు. రానున్న రోజుల్లో బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి ఆ గనులు మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ మార్పును గమనించే ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా గనుల తవ్వకంలో వందేళ్ల అనుభవం సింగరేణికి ఉందనీ ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా లిథియం, గ్రాఫైట్ వంటి గనుల తవ్వకాల వైపు సింగరేణిని తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఇందుకుగాను దేశవ్యాప్తంగా నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యువతను సివిల్స్ వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ప్రతి దశలోనూ రూ. ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. అంది వచ్చిన అవకాశాన్ని తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలన్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధిస్తే రాష్ట్రానికి కావాల్సింది అంతకన్నా ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బలమైన సంస్థ గా ఉన్న సింగరేణి లో కార్మిక సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కార్మికులు ఇది మా సంస్థ అని భావిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 200 కోట్లకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామన్నభట్టి విక్రమార్క..సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణమని చెప్పారు.
ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారన్న భట్టి.. తాము సింగరేణిని ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నామని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబానికి రూ. కోటికి పైగా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.