మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో
‘అస్మిత లీగ్’ పేరుతో మహిళల క్రీడలు, వేడుకల కార్యక్రమం
ముద్ర, హైదరాబాద్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ‘అస్మిత లీగ్’ కింద ఒక భారీ క్రీడలు, వేడుకల కార్యక్రమం నిర్వహించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ‘మేరా యువ భారత్’ హైదరాబాద్ విభాగం.. భారత క్రీడా ప్రాధికార సంస్థ, ఖేలో ఇండియా, తెలంగాణ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది.

ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా క్రీడాకారిణులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. క్రీడలు, సామాజిక భాగస్వామ్యం ద్వారా మహిళా సాధికారతను ఈ వేడుక ఘనంగా చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో భాగంగా 13 ఏళ్ల లోపు, 13–18 ఏళ్ల మధ్య, 18 ఏళ్ల పైబడిన వివిధ వయో వర్గాల వారికి పరుగు పోటీలను నిర్వహించారు. క్రీడాకారుల ప్రతిభ, వారిలోని పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలను అథ్లెటిక్ ఈవెంట్లుగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, ప్రసార భారతి (ఆకాశవాణి) అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి సీమా కుమారి, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి శ్రీమతి సౌందర్య, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్‌పర్సన్ శ్రీమతి బీ. మాధవీ, జాతీయ రోయింగ్ క్రీడాకారిణి – ఆసియా క్రీడల ప్రతినిధి కుమారి గీతాంజలి, జిల్లా యువజన, క్రీడా అధికారి శ్రీ నందకిషోర్ గోకుల్ హాజరయ్యారు.
క్రీడలు, ఆరోగ్యం, శారీరక దృఢత్వంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన అతిథులు ప్రశంసించారు. క్రీడలను ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే మార్గంగా ఎంచుకోవాలని యువ క్రీడాకారిణులను వారు ప్రోత్సహించారు.
విజేతలతో పాటు రెండో స్థానంలో నిలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు, పతకాలను ముఖ్య అతిథులు అందించారు. క్రీడా ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని ఈ సందర్భంగా వారు క్రీడాకారులను కోరారు.
ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది. క్రీడల ద్వారా మహిళా సాధికారత, సమానత్వం, వేడుకల స్ఫూర్తిని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది.