ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ను పార్టీ లకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పాలమూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే కార్పొరేటర్ల ను ఉద్దేశించి మాట్లాడారు.నగర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్‌గా మారిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో దీన్ని సమర్థవంతంగా అమలు చేసి నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేద్దామని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. గతంలో బడ్జెట్‌లో ఉన్న లోటును దశలవారీగా భర్తీ చేయడానికి కృషి చేయాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సమన్వయంతో పనిచేయాలన్నారు.నగర అభివృద్ధి ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆదాయ వనరులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, పన్నుల వసూళ్లను పెంపొందించాలన్నారు. ముఖ్యంగా ఆస్తి పన్నుల వసూళ్లు వంద శాతం జరిగితేనే ప్రతి డివిజన్‌లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయి ఖర్చు పారదర్శకంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, నిధులను సమర్థవంతంగా వినియోగిస్తేనే మహబూబ్ నగర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చన్నారు.రానున్న ఐదేళ్ల పాటు ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు లభించిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలన్నారు అనంతరం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని పార్టీ లకు అతీతంగా కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే నాయకత్వంలో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు మేయర్ గుమాల మమత బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రామాం జనేయ రెడ్డి,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
………………………………
ప్రోటోకాల్ రగడ :
……………………………..
కౌన్సిల్ సమావేశానికి ముందు డయాస్ పై ఎక్కువ కుర్చీలు ఉండడం బీ ఆర్ ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ ఒక్కరే డయాస్ పై ఉండాలని ఇంకా ఎవ్వరూ ఉండవద్దని మున్సిపల్ అధికారులను ఆదేశింశించారు. అయినా అధికారులు స్పందించలేదు. డయాస్ పై మేయర్ తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, కమిషనర్, అసిస్టెంట్ కలెక్టర్ కూర్చున్నారు. దీని పై బీ ఆర్ ఎస్ సభ్యులు గొడవకు దిగారు. మున్సిపల్ చట్టం లో ప్రోటోకాల్ లో వీరందరూ డయాస్ పై కూర్చోవచ్చని కమిషనర్ చెప్పినా వారు వినలేదు. కొద్ది సేపు తీవ్ర రగడ జరిగింది. దీంతో బీ ఆర్ ఎస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగింది.
…………………………………
అభివృద్ధి ప్రధాత యెన్నం
– డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి
-…………………………………
పాలమూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మున్సిపల్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం రూ.వేయి కోట్ల వ్యయం తో భూగర్భ డ్రైనేజీ కోసం నిధులు మంజూరు చేయించారని, నగర అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే మూడేళ్ల కాలం లో పాలమూరు నగర అభివృద్ధి కానీవిని ఎరగని రీతిలో జరుగుతుందన్నారు. కౌన్సిల్ సమావేశం లో రగడ చేసేందుకే బీ ఆర్ ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నం చేశారన్నారు. ఇది వారి ఉదేశ్యం కాదని, మరో నేత డైరెక్షన్ చేస్తే వీరంతా యాక్షన్ చేశారని ఆయన విమర్శలు చేశారు. పాలమూరు నగర అభివృద్ధి లో పార్టీ లకు అతీతంగా పనిచేద్దామని, ఎవరి డైరెక్షన్ లో మనం యాక్షన్ చేయవద్దన్నారు. సమావేశం లో గొడవ చేస్తే పాలమూరు అభివృద్ధి ఆగిపోతుందని, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుని అభివృద్ధి కి సహకారించాలని కార్పొరేటర్ల కు విజ్ఞప్తి చేశారు. స్నేహపూరిత వాతావరణం లో సమావేశాలు జరిగితే మనను ఎన్నుకున్న ప్రజల్లో నమ్మకం కలుగుతుందని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంచి వాతావరణం లో మంచి నిర్ణయాలు తీసుకుని కౌన్సిల్ అభివృద్ధి కోసం కలిసి పాటుపడదామన్నారు.