ముద్ర కూకట్‌పల్లి :
సమయస్ఫూర్తితో స్పందించిన కూకట్‌పల్లి పోలీసులు ఐడీఎల్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
కల్వకుర్తికి చెందిన రియా (20) అనే డిప్లొమా విద్యార్థిని ప్రస్తుతం కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్‌లో నివసిస్తోంది. సోమవారం ఉదయం వ్యక్తిగత కారణాలతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఐడీఎల్ సరస్సు వద్దకు చేరుకుంది. ఉదయం 11:55 గంటల ప్రాంతంలో ఈ విషయంపై డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ దీక్షిత, పెట్రోల్ కార్ డ్రైవర్ వెంకటప్ప క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే సదరు యువతి సరస్సు మధ్యలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
యువతికి ప్రాథమిక కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం ఆమెను క్షేమంగా బంధువుల వద్దకు చేర్చారు. పోలీసుల వేగవంతమైన స్పందనను, సాహసాన్ని కూకట్‌పల్లి డీసీపీ రితా రాజ్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించి, నగదు పురస్కారాలను అందజేశారు. ప్రజల ప్రాణాల రక్షణలో సైబరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.