Take a fresh look at your lifestyle.

ఆర్థిక సంక్షోభాల పట్ల మోదీ మౌనం వీడాలి- CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

 

ముద్ర,గద్వాల:

దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ సభాధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలను నివారించడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఇరాన్ పై సామ్రాజవాద అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల పట్ల మౌనం వహిస్తూ బీజేపీ రాజ్యాంగ విలువలను కాల రాస్తున్నదని విమర్శించారు. వలసవాద సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకిస్తున్నామని ధైర్యంగా చెప్పలేని మోడీ ప్రభుత్వం, దేశ సార్వభౌమత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరాం నాయక్, వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళకు వెళ్లి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 కౌలు రైతులకు రూ.15000,‌ మహిళలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని అమలు చేయని అసమర్ధ సీఎం, దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళ రాష్ట్రాన్ని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. హామీల అమలు చేయడం చేతకాక అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెబుతామన్నారు. కేరళ తరహాలో మొత్తం ప్రజానీకానికి ఉచిత విద్య అందించే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ఉందా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు జి రాజు, పరం జ్యోతి,వివి నరసింహ, మద్దిలేటి,ఈదన్న, నర్మదా, రమేష్, మండలాల కార్యదర్శులు విజయ్ కుమార్, రాముడు, నరసింహులు, నరేష్,మంచాల నరసింహ, వెంకటేష్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.