ముద్ర : మల్కాజిగిరి
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో నేరెడ్మెట్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీస్ స్టేషన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్టేషన్ కార్యకలాపాలను జనరల్ డైరీ ఎంట్రీ ద్వారా అధికారికంగా ప్రారంభించారు. రోడ్డు భద్రత డీసీపీ కె. మనోహర్ ఈఓ డబ్ల్యు పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు పి. సత్తయ్య, సి. అంజయ్య, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు కె. భాస్కర్, ఎ. సూర్య నాయక్, కె. రవి కుమార్ సేవలు అందించనున్నారు.
ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ప్రధానంగా ఆర్థిక మోసాల కేసులను విచారిస్తుంది. రూ. 2 కోట్లకు పైబడిన మోసాలు, నమ్మకద్రోహం, నకిలీ పత్రాల సృష్టి వంటి కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అలాగే తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం, 1999 (2023 సవరణ) కింద రూ. 1 కోటి పైబడిన కేసులను కూడా పరిశీలిస్తుంది.
అదనంగా, కమిషనర్ ఆదేశాల మేరకు ఇతర ఆర్థిక నేరాలను కూడా ఈ విభాగం విచారించనుంది.