సింగరేణి ప్రజలకోసం జీవో 76ను పరిష్కరిస్తాం-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపిస్తే మరిన్ని ప్రగతి ఫలాలు
ముద్ర, కొత్తగూడెం :
కొత్తగూడెం- సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాలకు సంబంధించి జివో 76ను పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రచారం నిర్వహించిన మంత్రి మాట్లాడారు. ఇప్పటికే ఈ ఇండ్ల స్ధలాల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి సభలో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. కార్మిక పక్షపాతిగా నిలిచిన తమ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ కాంగ్రెస్ ప్రతినిధులేనన్న మంత్రి… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపించి అభివృద్ది ఫలాలు అందుకోవాలన్నారు. కత్తి ఎవరికో ఇచ్చి నన్ను యుధ్దం చేయమంటే ఎలా?.. కత్తి నాచేతికి ఇచ్చి యుద్ధం చేయమంటే చేస్తానని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ది కోసం కాంగ్రెస్, మిత్రపక్ష అభ్యర్దులను గెలిపించాలన్నారు. కొత్తగూడెం పరిధిలోని 60 డివిజన్లలో 58 చో్ట్ల కాంగ్రెస్,2 చోట్ల సిపిఎం అభ్యర్ధులు పోటీ చేస్తున్నారని వీరందరినీ గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు. కొత్తగూడెం ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, వంతెనల నిర్మాణం, ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలను వేధిస్తున్న మంచి నీటి సమస్య తీరి 24 గంటలూ మంచినీటి సరఫరా కావాలన్నా కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఇవేగాక యువతకు ఉపాధి కల్పనా కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాథ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన పేదలకు ఇంటిస్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.