ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ
సాక్ష్యాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగలబెట్టిండు
ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నడు
ముద్ర, సిద్ధిపేట :
సీఎం రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ కు శిక్షపడక తప్పదన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారన్నారు. ఇందులో భాగంగా ఆ కేసులో విచారణ ఫైళ్లు ఉన్న నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టించారని ఆరోపించారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో పర్యటించారు. చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న హరీశ్ రావు…. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవంత్ పాలన అంత తుస్సే అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో భూముల విలువ పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు తగ్గడమే కాదు.. తెలంగాణ ప్రతిష్ట కూడా దిగజారిందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేతిలో మోసపోని మనిషే లేడని పేర్కొన్నారు. హామీలు, గ్యారంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి చురుకు తగిలితేనే పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీశ్‌రావు అన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు.ఇక్కడ హరీశ్‌రావు ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడటం లేదని పేర్కొన్నారు. మెదక్‌లో రేవంత్ రెడ్డి ఒక్క వార్డులో కూడా గెలవడని తెలిపారు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ లేదు కానీ.. స్కామ్ క్యాలెండర్ అయితే ఇచ్చిండని విమర్శించారు. ప్రతి నెల ఏదో ఒక కుంభకోణం తెరపైకి తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా, పాడిపంటలతో సుభిక్షంగా, చల్లగా ఉండేవారని, రేవంత్ సర్కారులు నీటి కష్టాలు, కన్నీటి బాధలు గ్రామాలను ముంచెత్తుతున్నాయని విమర్శించారు.