Take a fresh look at your lifestyle.

రోడ్డు వెడల్పు పేరుతో ప్రజల జీవితాలు ఆగం చేయొద్దు

  • సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్.
  • 5 ఫీట్ల వెడల్పు పెంచడాన్ని నిరసిస్తూ చేర్యాలలో ఆందోళన.
  • చేర్యాలలో ఉద్రిక్తత పలువురి అరెస్టు స్టేషన్ కు తరలింపు.

ముద్ర,చేర్యాల : రోడ్డు వెడల్పు పేరుతో ప్రజల జీవితాలలో ఆగం చేయొద్దని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ అన్నారు. అదనపు డ్రైనేజీ నిర్మాణం పేరుతో రోడ్డు వేయడానికి మార్కింగ్ చేయడాన్ని నిరసిస్తూ చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారులో జాతీయరహదారిని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. చేర్యాల ఎస్సై వేముల నవీన్ సంఘటన స్థలానికి చేరుకొని పై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయం జరిగేంత వరకు వెళ్లేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్, యజమానుల సంఘం నాయకుడు అయిత సంపత్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి కళ్యాణ్ చక్రవర్తికి వినతి పత్రం సమర్పించారు. ఈసంవత్సరం క్రితం సూర్యాపేట నుండి దుద్దెడ క్రాసింగ్ వరకు నిర్మించిన జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్డు మధ్యలో నుండి ఇరువైపులా 45 ఫీట్ల చొప్పున మార్కింగ్ చేసి రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టారని, ఎంతో విలువైన షాపులు, ఇండ్లు, పార్కింగ్ స్థలం సైతం సర్వస్వం కోల్పోయినా ఎలాంటి పరిహారం తీసుకోకుండా ఆర్అండ్ బి, మున్సిపల్ అధికారులకు ఇంటి యజమానులుగా అన్ని విధాల సహకరించామని అన్నారు. సంవత్సరం క్రితమే డ్రైనేజీ, మిషన్ భగీరథ పైపు లైన్, టెలిఫోన్ వైరింగ్ తో పాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రోడ్డు వెడల్పులో తొలగించగా మిగిలిన అసంపూర్తి నిర్మాణాలను ఎంతో కష్టపడి ఫైనాన్స్, అప్పులు తీసుకొచ్చి పునర్నిమించుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఇప్పటికే తాలూకాకేంద్రం, డివిజన్, పెద్ద మండలం కోల్పోయి వ్యాపారాలు సక్రమంగా నడవకపోవడంతో ఎంతోమంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేడు సంవత్సరం గడిచిన తర్వాత మరో డ్రైనేజీ అవసరం లేకున్నా అదనంగా డ్రైనేజీ కాలువ నిర్మాణం పేరుతో మరో 5 ఫీట్లకు మార్కింగ్ పెట్టి కూల్చివేస్తామని భయబ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. వెంటనే అదనపు డ్రైనేజీ కాలువ నిర్మాణం, విస్తరణ పనులను ఆపివేసి ఇంటి యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చేర్యాల పట్టణ ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంటి యజమానుల సంఘం నాయకులు శేరి బాలనారాయణ, కందుకూరి కృష్ణమూర్తి, తాళ్లపల్లి రమేష్, వీరబత్తిని రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస్, ఉప్పల చంద్రమౌళి, పెద్ది అంజయ్య, శేరి ప్రసాద్, సామల మహేందర్, తేరాల శంకర్, మురళి గౌడ్, వీరికి సిపిఐ మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు కర్క తిరుపతిరెడ్డి, యువజన సంఘం మండల నాయకుడు అరుట్ల లింగం, తదితరులు మద్దతు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.