కవిత మద్దతు అభ్యర్థుల కారణంగా గులాబీ ఓట్లలో చీలిక స్పష్టంగా కనిపించింది
బీఆర్ఎస్‌కు అతిపెద్ద ముప్పుగా కవిత
సింహం గుర్తుతో పోటీ చేసిన వర్గం బీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చింది
లక్షకు చేరువైన ఓట్లు చీలడంతో గెలుపోటముల సమీకరణాలు మారాయి
పార్టీ లేకుండానే కవిత ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించింది
త్రిముఖ పోటీలో ప్రతి శాతం ఓటు కీలకంగా మారింది
కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చినా ఓట్ల శాతం పరంగా గట్టి పోటీ కనిపించింది
బీజేపీ, స్వతంత్రుల ఓట్లు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయి
పార్టీ పెడితే.. గెలుపు అంశం కాదు.. చీలికతోనే ప్రమాదం
బీసీ అస్త్రంతో కవిత రాజకీయ వ్యూహం కొత్త మలుపు తిరిగింది
రానున్న ఎన్నికల్లో చతుర్ముఖ పోరు తప్పదనే సంకేతాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
స్థానిక ఎన్నికల్లో ఒక్క ఓటు అయినా కీలకమే. ఎందుకంటే అదే గెలుపోటములను ప్రభావితం చేస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్, 116 మున్సిపాలిటీలలోని 2,981 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీ గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచి సత్తాచాటింది. కానీ పోల్ అయి, చెల్లుబాటైన ఓట్లలో కేవలం 39.8 శాతం ప్రజల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. మొత్తం 2,936 మందిని పోటీకి దింపిన హస్తం పార్టీ 15,04,669 ఓట్లు దక్కించుకుంది. 2,876 మంది అభ్యర్థులు పోటీ చేసిన బీఆర్ఎస్ కు 28.75 శాతం ప్రజలు జైకొట్టారు. ఈ లెక్కన 10,87,009 మంది గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈ రెండు పార్టీలు సాధించిన వార్డులు, మున్సిపాలిటీలలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఓట్ల మధ్య తేడా కేవలం 4,17,660 మాత్రమే కావడం గమనార్హం. ఇక 2,634 మందిని బరిలోకి దింపిన కాషాయ దళం 15.68 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. 5,92,753 మంది బీజేపీకి ఓటు వేశారు. చాలా మంది గెలుపోటములు ప్రభావితం చేసిన స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 2,787 మంది పోటీ చేయగా, 8.31 శాతంతో 3,14,096 ఓట్లు సాధించారు. కేవలం 283 వార్డుల్లోనే పోటీ చేసిన ఏఐఎంఐఎం (మజ్లిస్ పార్టీ) 3.29 శాతంతో 1,24,236 ఓట్లు పొందింది. ఇదంతా ఓకే.. కానీ, చాలా చోట్ల పదుల సంఖ్యలో గులాబీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఓడిపోయిన వారందరికీ ఒకే కారణం చూపించలేకపోయినా.. అందులో కేసీఆర్ కూతురు, కేటీఆర్ సోదరి కవిత ప్రభావం మాత్రం ఎంతో కొంత కనిపిస్తోంది.
గెలుపు కాదు.. విజయాలు తారుమారు
ప్రధానంగా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై కవిత మద్దతుదారులు పోటీ చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఫార్వర్డ్ బ్లాక్ కు వచ్చిన ఓట్లు 57 వేలు. ఇందులో మెజార్టీ కవితదే అన్నట్టు స్పష్టమవుతోంది. అంతేకాకుండా కొన్నిచోట్ల ఇండిఫిండెంట్లకు కూడా కవిత మద్దతు ఇచ్చింది. అవి 1 శాతంగా కనిపిస్తున్నాయి. ఇలా దాదాపుగా లక్ష ఓట్లను ఎలాంటి గుర్తు.. సొంత పార్టీ లేకుండానే కవిత చీల్చి వేశారు. అంటే.. రాజకీయ రణరంగంలోకి దిగి.. పార్టీ గుర్తుపై పోటీకి సిద్ధమైతే.. ప్రధాన పార్టల గెలుపోటములను తారుమారు చేసే ఓట్లను కవిత చీల్చుతుందనడంలో సందేహం కనిపించడం లేదు.
1537 వార్డుల్లో జయపతాకం ఎగురవేసిన హస్తం పార్టీ
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వార్డులతో కలిపి మొత్తం 2995 వార్డుల ఫలితాలు వెల్లడైనట్లు ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ కు 1537 వార్డులు, బీఆర్ఎస్ 781, బీజేపీ 336, ఎంఐఎం 70, సీపీఎం 13, బీఎస్పీ రెండు స్థానాలు దక్కాయి. టీడీపీ, వైసీపీ, ఆప్ లకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఇతర పార్టీలు 73, స్వతంత్రులు 183 స్థానాల్లో గెలిచారు. పార్టీల వారీగా ఈ ఫలితాలను ఎస్ఈసీ వెబ్ సైట్ లో పొందుపర్చింది.
కవిత రూపంలో గులాబీకి ముళ్లు..?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతోంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన భారత్ రాష్ట్ర సమితి ప్రస్తుతం పూర్వవైభవం పోరాడుతున్న తరుణంలో, ఆ పార్టీ ఇంటి పోరే పెద్ద శాపంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయడం గులాబీ బాటలో ముళ్ల కంచెగా మారుతోంది. పైకి బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో కవిత చీల్చే ప్రతి ఓటు పార్టీ పునాదులను కదిలిస్తుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
సింహం గుర్తు ఎఫెక్ట్.. ఓట్ల చీలికతో ముప్పు
మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రత్యక్షంగా పార్టీ పెట్టకపోయినా, తన మద్దతుదారుల ద్వారా సింహం గుర్తుకు మద్దతు ఇచ్చి కొన్ని చోట్ల గట్టి ప్రభావమే చూపారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పెద్దల కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. కవిత పార్టీ పెట్టడం వల్ల ఆమె అధికారంలోకి వస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఆమె చీల్చే నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లు బీఆర్ఎస్ గెలుపోటములను తలకిందులు చేయడం ఖాయం. ఉమ్మడి సిద్ధాంతాలు, ఒకే రకమైన ఓటు బ్యాంకు ఉండటంతో కవిత వైపు వెళ్లే ప్రతి ఓటు నేరుగా బీఆర్ఎస్ ఖాతా నుంచే మైనస్ అవుతుంది. ఇది త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల కొంప ముంచేలా ఉంది.
పెరిగిన అంతరం
కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గాలికి వదిలేశారంటూ ఆమె సంధిస్తున్న విమర్శలు పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. తండ్రి కేసీఆర్ పట్ల గౌరవం చూపిస్తూనే, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఆమె చేస్తున్న దాడి ద్వారా అసంతృప్త నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది.
బీసీ అస్త్రం.. రాజకీయ సామాజికం
ప్రస్తుతం కవిత తన రాజకీయ ఎజెండాలో బీసీ సామాజిక వర్గాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆమె చేస్తున్న ఆరోపణలు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుపై దెబ్బకొట్టేలా ఉన్నాయి. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పేరు , జెండాను ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేయడం, రాజకీయ వ్యూహకర్తల సహకారం తీసుకుంటున్నారనే వార్తలు బీఆర్ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యమ కాలం నుంచి తనతో నడిచిన తెలంగాణ జాగృతి కేడర్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా మారితే, అది బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది.
గులాబీ కేడర్ కు అంతర్గత భయం
ఏదైనా కవిత రూపంలో వచ్చే ప్రమాదం గులాబీ నేతలను అంతర్గతంగా భయపెడుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, కవిత వేస్తున్న అడుగులను గమనిస్తుంటే, రానున్న రోజుల్లో తెలంగాణలో చతుర్ముఖ పోరు తప్పదనిపిస్తోంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ బలాన్ని పెంచుకుంటుంటే, మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ పరిస్థితుల్లో కవిత రూపంలో ఎదురవుతున్న ఈ సొంత ముప్పును బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె చేసే విమర్శలు ఆమెకు సానుభూతిని కూడగట్టడమే కాకుండా, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రాజకీయ యుద్ధంలో కవిత గెలుస్తారో లేదో కానీ, బీఆర్ఎస్ ఓటమికి మాత్రం ఆమె ప్రధాన కారకురాలిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
====
పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం (%) పోటీకి దిగిన అభ్యర్థులు
కాంగ్రెస్ 15,04,669 39.80% 2,936
బీఆర్ఎస్ 10,87,009 28.75% 2,876
బీజేపీ 5,92,753 15.68% 2,634
స్వతంత్రులు 3,14,096 8.31% 2,787
మజ్లిస్ 1,24,236 3.29% 283
ఫార్వర్డ్ బ్లాక్ 57,129 1.51% 288
సీపీఐ 49,450 1.31% 168
సీపీఎం 22,048 0.58% 128
జనసేన 13,504 0.36% 333
బీఎస్పీ 7,715 0.20% 213
టీఆర్ఏపీ 3,379 0.09% 91
ఆప్ 1,717 0.05% 38
ఇతరులు 2,668 0.07% 154