- మంత్రి తుమ్మెలను కోరిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రైతులకు మేలు చేకూర్చే విధంగా రాయితీపై ఆధునిక వ్యవసాయ పనిముట్లు విరివిగా మంజూరు చేయాలని మానకొండూర్ శాసనససభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన సందర్బంగా రైతాంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు.చిన్న, సన్నకారు రైతన్నలకు రాయితీపై వ్యవసాయ పనిముట్లతోపాటు డ్రిప్ పరికరాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా మానకొండూర్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యగల మండలాల్లో బిందు సేద్యాన్ని ప్రోత్సహించేలా పరికరాలు అందించాలని కోరారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల సద్వినియోగానికి డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం), స్ప్రింక్లర్ ఇరిగేషన్ (తుంపర్ల సేద్యం) మాత్రమే రైతులకు ప్రత్యామ్నాయ మార్గమని, అందుకే వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.