- ఆ సంస్థ సీఈవో మాజీ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సర్వేజనా ఫౌండేషన్ చొరవతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ సీఈవో, మాజీ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి చెప్పారు.రోడ్డు ప్రమాదాల కారణంగా మనుషులు తమ కుటుంబాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏ. గురువారెడ్డి ఆధ్వర్యంలో సర్వేజనా ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లోని స్టాప్ రోడ్ అక్సిడెంట్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే రోడ్డు భద్రతకు సంబంధించిన 24 ప్రశ్నలు ఉంటాయన్నారు.వాటిల్లో సరైన సమాధానాలు రాసిన వారికి ప్రతి నెల ఒక లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తున్నామని జనార్దన్ రెడ్డి చెప్పారు.ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో రోడ్ ట్రాఫిక్ రెగ్యూలేషన్స్ పై కేంద్ర జాతీయ రహదార్లు – రవాణా శాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జనార్దన్ రెడ్డి మాట్లాడారు..రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం హెల్మెట్, సీట్ బెల్టు ధరించకపోడమని, ఓవర్ స్పీడ్‌తో పాడు సెల్ ఫోన్ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్స్ ను అతిక్రమించడం, రాంగ్ రూట్‌లో వెళ్ళడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పారు.మన దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఏటా ఒక లక్షా 40 వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. మొత్తం 67 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ కలిగిన మన దేశంలో 26 కోట్ల ద్విచక్ర వాహనాలు, ఐదు కోట్ల నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు.ప్రతిరోజు మన దేశంలో గంటకు 55 ప్రమాదాలు జరుగుతుంటే 20 మంది చనిపోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్వేజనా ఫౌండేషన్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ సిద్ధార్ద్, సీఓఓ ప్రవీణ్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి అరవేంద్ర కుమార్ భాస్కర్, సివిల్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ బి. వెంకట్ రెడ్డి తదితర అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన రవాణా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
