ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో వర్షాలు, అకాల వరదలు సంభవించిన సందర్భంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.నిర్మల్ జిల్లా చించోలి ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సహాయక విన్యాసాలు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రదర్శనలను కలెక్టర్ పరిశీలించి, బృంద సభ్యుల పనితీరును అభినందించారు. వారి వద్ద ఉన్న ఆధునిక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో అవి ఎలా ఉపయోగపడతాయన్న అంశాలపై కలెక్టర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గోదావరి స్వర్ణ, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలు, జీఎన్‌ఆర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరదల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు జిల్లా స్థాయిలో ప్లడ్ మాన్యువల్ తయారు చేసినట్లు పేర్కొన్నారు.కడెం, ఖానాపూర్, సారంగాపూర్, దస్తురాబాద్, బైంసా మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత 15 రోజులుగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం పనిచేస్తుందని తెలిపారు. వరదల వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విపత్తు సమయంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మైనార్టీ పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసీల్దార్ రాజు, ఎంపిడిఓ లక్ష్మీకాంతం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.