- ఘనంగా ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలు.
ముద్ర, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత విద్య అభివృద్ధికి కృషి చేస్తున్నామని, 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో 13 వేల మంది విద్యార్థులు చదువుకోగా, 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలేజీ ఏర్పాటు చేసిన నుండి గత సంవత్సరం వరకు 13,050 మంది పట్టభద్రులు అవుతే అందులో సుమారు పదివేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారని, మిగతా మూడు వేల మంది ప్రైవేట్ రంగాలలో రాణిస్తున్నారని అన్నారు.1994వ సంవత్సరంలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల కోసం అప్పటి సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒక సంవత్సరం పాటు కష్టపడితే 1997 లో కాలేజీ శాంక్షన్ జీవో ఇచ్చారని తెలిపారు. 28 ఆగస్టు 1998 లో అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కాలేజీని ప్రారంభించుకున్నామని, ఈ కాలేజీ జీవో వచ్చిన తర్వాత స్థలం కోసం చూస్తుండగా అప్పట్లో ఈ స్థలంలో శ్రీ రామ్ నారాయణ కేడియా ఫ్యాక్టరీ ఉండేదని, కాలేజీ గురించి వారికి తెలవగానే వారి ఫ్యాక్టరీ స్థలం సుమారుగా 12 ఎకరాల స్థలాన్ని ఉచితంగా విరాళంగా ఇచ్చారని, అందుకే ఈ కాలేజీకి ఆయన పేరు శ్రీ రామ్ నారాయణ ఖెడియా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అని పెట్టుకున్నామని అన్నారు.ఈ కాలేజీ స్థాపింపబడినప్పటి నుండి ఈ కాలేజీలో పనిచేసిన అధ్యాపకులు గాని ప్రిన్సిపాల్స్ గాని చాలా పట్టుదలతో పని చేశారని అన్నారు.ఇప్పుడు ఈ కాలేజీలో 42 మంది టీచింగ్ స్టాఫ్, 19 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, మూడు కంప్యూటర్ ల్యాబ్స్, 12 సైన్స్ ల్యాబ్స్, 52 క్లాస్ రూమ్ లతో అన్ని హంగులతో కొనసాగుతుందన్నారు.
ఉన్నత విద్య శాఖ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సంకల్పంతో ఈ ప్రాంత పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కళాశాల అని, దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కళాశాల అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇప్పటితో ఆగకుండా గోల్డెన్ జూబ్లీ కొనసాగాలని, ఎమ్మెల్యే పోచారం పాల్గొనాలని, ఈ పరంపర భవిష్యత్తులో ఉండే నాయకులు,అధ్యాపకులు, విద్యార్థులు కష్టపడి శ్రమించి ఈ కాలేజీ పేరును ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ బాన్సువాడ లో ఎస్ ఆర్ ఎన్ కె కళాశాల అభివృద్ధి కి పోచారం చేస్తున్న కృషి ని ప్రశంసించారు. స్థల ప్రదాత అయిన ఖేడియా వల్లే ఇంత గొప్ప కళాశాల ఏర్పాటు సాధ్యం అయిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.కాగా ఈ వేడుకల్లో కశ్మీర్ లో తీవ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులను సన్మానించారు. తెలుగు లో పిహెచ్ డి చేసి, కవులపై పరిశోధనాత్మక పుస్తకం రాసిన అఫ్రీన్ తన పుస్తకాన్నీ ఎమ్మెల్యే పోచారం నకు అంకితం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు, పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఖేడియా మనుమడు, బాన్సునాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
