Take a fresh look at your lifestyle.

శరణార్ధిగా గుర్తించలేం!

  • ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావుకు అమెరికా షాక్.
  • ప్రభాకర్ రావు‌ పిటీషన్ ను విచారించిన యూఎస్.
  • శరణార్ధిగా గుర్తించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన అమెరికా.
  • ప్రభాకర్ రావును తెలంగాణకు రప్పించేందుకు లైన్ క్లియర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : అమెరికాలో తలదాచుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు.. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావుకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యూహాల నుంచి తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు చేస్తున్న ప్రయత్నాలకు యూఎస్ సర్కార్ చెక్ పెట్టింది. ఈ నెల 10న ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ మేరకు గతేడాది నవంబర్ 29న తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వం తనపై కేసు పెట్టిందని.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి అందించిన పిటిషన్ పై అక్కడి సర్కార్ సోమవారం విచారణ చేపట్టింది. పిటీషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అమెరికా ప్రభాకర్ రావు‌ను అభ్యర్థనను తోసిపుచ్చింది. తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని తేల్చి చెప్పింది. అక్కడి ప్రభుత్వం స్పష్టీకరణతో.. తెలంగాణ పోలీసుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు ప్రభాకర్ రావు చేస్తోన్న ప్రయత్నాలన్నీ నీరుగారాయి. దీంతో ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించడంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. మరోవైపు.. ప్రభాకర్ రావును భారత్‌కు పంపించేందుకు యూఎస్ హోమ్‌ల్యాండ్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇదీలావుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌ రావు వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టు లో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాని పక్షంలో ప్రకటిత నేరస్థుడిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.

  • ఆరు నెలల క్రితమే అమెరికా సర్కార్ కు పిటిషన్.

గతేడాది నవంబర్ 29న తనను రాజకీయ శరణార్దిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని తన కొడుకు వద్ద తాను ఉంటున్నాని ఆయన ఆ పిటిషన్ లో చెప్పారు. తనకు అనారోగ్య సమస్యలున్నాయని ఆయన ఆ పిటిషన్ లో వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాను ఇంటలిజెన్స్ విభాగంలో ఓఎస్ డీ గా ఆయన పనిచేశాననీ రిటైరైన తర్వాత కూడా ఆ హోదాలో కొనసాగినట్లు ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి వివరించారు. అదే సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ప్రచారం జరిగిందన్నారు. అప్పట్లో తన కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించిన అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి వచ్చిన విచారణ చేస్తామని చెప్పినట్టు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. చెప్పినట్టే ఇప్పుడు తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని..తెలంగాణ ప్రభుత్వం రాజకీయ క్షక్ష సాధింపు నుంచి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ క్రమంలో తనను రాజకీయ శరణార్ధిగా ప్రకటించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.

  • శ్రవణ్ రావు విచారణకు అనుమతివ్వండి : నాంపల్లి కోర్టులో సిట్ అధికారుల పిటిషన్

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో నిందితుడు శ్రవణ్‌ రావును విచారించేందుకు ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ రావు ను సీసీఎస్ పోలీసులు ఇటీవలే ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దాంతో ఈనెల 23న ఆయన్ను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు శ్రవణ్ రావును విచారించాలంటూ ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కేసు తీవ్రతను పరిశీలించిన కోర్టు ఒక్కరోజు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.