Take a fresh look at your lifestyle.

భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగొద్దు

  • శ్రీరామ నవమికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం వుంది.
  • అధికార్లు అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహించాలి.
  • భద్రాచలంలో నవమి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సమీక్ష.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భద్రాచలానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారులు వారికి అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం ఆయన భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై శాఖల వారీగా ఆయన సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వైభవోపేతంగా ఎక్కడా లేని విధంగా సీతారాముల వారి కళ్యాణం జరిగే పవిత్ర స్థలం మన భద్రాచల పుణ్యక్షేత్రమన్నారు. ఈ క్షేత్రంలో కొన్ని దశాబ్దాల తరబడి సీతారాముల వారి కళ్యాణం ఆనవాయితీగా జరుగుతున్నదని తెలిపారు. కళ్యాణమహోత్సవాన్ని ప్రత్యేకంగా కానీ, పరోక్షంగా కానీ వీక్షించిన భక్తులకు ఎంతో పుణ్యం వస్తుందని వేదాల్లో చెప్పడం జరిగిందన్నారు. అందువల్ల ఇక్కడకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, పూర్తి స్థాయిలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంచి నీరు, చలువ పందిళ్లు, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాగ్ లిస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు కళ్యాణ వేడుకలు వీక్షించేందుకు 26 సెక్టార్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సెక్టార్లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కల్యాణ వేడుకలకు విచ్చేయు భక్తులకు స్వామి వారి కళ్యాణ వేడుకలు వీక్షించి జన్మ జన్మల పుణ్యాన్ని పొందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం తరపున మార్చి30 నుండి ఏప్రిల్ 12వ తారీకు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యాయన్నారు. కళ్యాణం జరిగే ముందు రోజు స్వామి వారి ఎదుర్కోళ్ల ఉత్సవం ఉంటుందని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం 75 శాతం ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచామని, భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు మహా ప్రసాదం కూడా అందించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. తలంబ్రాల కౌంటర్లు 80 వరకు ఏర్పాటు చేస్తున్నామన, ప్రతి ఆర్టీసీ బస్సులో భక్తులకు కేజీ చొప్పున తలంబ్రాలు అందిస్తున్నామని చెప్పారు. సీఎం రాక కోసం మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నామని, ఆర్డబ్ల్యూఎస్, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, కళ్యాణం మరియు పట్టాభిషేకం జరిగే రెండు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జనరేటర్ను కూడా మిథిలా స్టేడియంలో అందుబాటులో ఉంచుతున్నామని, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా భక్తులకు, పార్కింగ్ ఏరియాలలో మరియు సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నామని వివరించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేశామని, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాల్స్, 20 మంది గజ ఈతగాళ్లను, రిస్క్ బోట్స్ 15, గోదావరిలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా భద్రాచలం, పర్ణశాల, హెలిపాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలలో కలుపుకొని 13 మెడికల్ క్యాంపులు, 5 అంబులెన్సులు,30 మంది ఫీల్డ్ స్టాప్, ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు, ఐసీయూ, 24 గంటలు పని చేసే అంబులెన్స్ తో పాటు ఓఆర్ఎస్ పాకెట్లు, అన్ని జబ్బులకు మందులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 6, 7 తేదీలలో బార్ షాపులు, బెల్టు షాపులు అన్నింటిని క్లోజ్ చేస్తామని, నాలుగు చోట్ల మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు భక్తులు మాత్రమే స్వామి వారి కళ్యాణం వీక్షించే విధంగా చూడాలని, కుటుంబ సభ్యులకు గానీ, బంధువులకు గాని ప్రాధాన్యత ఇవ్వకూడదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేసి వేణుగోపాల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్ రావు, దేవస్థానం ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.