Take a fresh look at your lifestyle.

ముందుగా ముగ్గురు..!

  • కేబినెట్​ విస్తరణ ఖరారు.
  • ఆమోదించిన అధిష్టానం.
  • రాజ్​ భవన్​కు సమాచారం ఇచ్చారంటున్న కాంగ్రెస్.
  • ముగ్గురు మంత్రులతో నేడు ప్రమాణ స్వీకారం ..?
  • కాంగ్రెస్​లో మారుతున్న సమీకరణాలు.
  • కొంతమంది హుటాహుటిన ఢిల్లీకి పరుగు.
  • ఇటు రాజ్​ భవన్​లో ఏర్పాట్లు.
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు గవర్నర్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆమోదం పడింది. దాదాపుగా నేడు కొత్తగా ముగ్గురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో మూడు పదవుల్ని మాత్రమే భర్తీ చేయనున్నారు. అయితే, ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ వర్గాలకూ స్పష్టత లేదు. రెడ్డి సామాజికవర్గంలో పోటీ తీవ్రంగా ఉండటంతో వారిలో ఎవరికీ అవకాశం కల్పించడం లేదని, బీసీ, ఎస్సీ వర్గాల వారికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ పరిధిలో మంత్రులు లేరు. కనీసం ఉమ్మడి జిల్లాకు ఓ మంత్రి పదవి కేటాయించకపోతే సమీకరణాలు సరిగ్గా ఉన్నట్లు కాదు. అందుకే.. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. మరోవైపు, ఢిల్లీలో ఉన్న గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ హుటాహుటిన హైదరాబాద్​కు ఆదివారం ఉదయం వచ్చేందుకు షెడ్యూల్​ ఖరారు అయింది.

  • బీసీకి డిప్యూటీ సీఎం ఛాన్స్​..?

రాష్ట్రంలో రేవంత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు మొత్తం పన్నెండు మంది ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఆరు స్థానాలను ఖాళీగా ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఆరు స్థానాలను భర్తీ చేయడానికి చాలా కసరత్తు చేశారు. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలికి పూర్తిగా కొత్త మంత్రివర్గాన్ని ప్రజల ముందు ఉంచాలనుకున్నారన్న ప్రచారం జరిగింది.కులాల సమీకరణాలు లెక్కలు వేసుకొని జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు ఇక, ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో కొన్ని జిల్లాల నుంచి ప్రాధాన్యత లేదు. ఆదిలాబాద్ నుంచి సీనియర్‌కు చోటు కల్పించనున్నారు. ఈ అంచనాలతో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య బీసీలకు 42శాతం కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది. దీంతో ఇప్పుడు చేసే మంత్రివర్గంలో బీసీలకు ఆ మేరకు ప్రాధాన్యత లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిస్తాయి. అందుకే ఆ లెక్కలను కూడా కాంగ్రెస్ చూసుకుంది. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరో బీసీకి అవకాశం కల్పించనున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఛాన్స్ ఎక్కువ ఉంది.ఈ రేసులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న మంత్రుల్లో ఓ బీసీ వర్గానికి చెందిన మంత్రికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని కూడా తెలుస్తున్నది. ఆరు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందన్న ప్రచారం జరిగుతోంది.హోంమంత్రి, విద్యా శాఖ మంత్రి కూడా లేరు.కీలక శాఖలన్నింటినీ రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. మరో మూడు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచడం వల్ల ఆశావహులు.. రెబల్స్ గా మారకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు.

  • అలసి.. సొలసి..?

ఢిల్లీ చుట్టూ కాంగ్రెస్​ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తిరిగి తిరిగి అలసిపోయారు. హైకమాండ్ కు విస్తరణ ప్రాధాన్యత చెప్పి చెప్పి విసిగిపోయారు. ఇక ఇప్పట్లో రాష్ట్ర క్యాబినేట్ విస్తరణకు ఛాన్స్‌ లేనట్లే అనుకుంటున్న తరుణంలో ఊహించన విధంగా కాంగ్రెస్ హైకమాండ్ కమాన్.. ప్రొసీడ్ అంటూ క్యాబినేట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది నుంచి త్వరలో విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గంలోకి కొత్త టీమ్ ఎంట్రీ ఇస్తుంది. ఆరు శాఖలకు కూడా మంత్రులను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.అలా చూస్తూ చూస్తూ ఏడాదిన్నర దాటిపోయింది. మరోవైపు బిఆర్‌ఎస్, బిజేపీలు రేవంత్ టార్గెట్‌గా విమర్శలతో అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతుండేవాళ్లు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేయడం తప్ప విస్తరణ చేయలేనివాళ్లు, రాష్ట్రాన్ని అభివృద్దిలో ఎలా నడిపిస్తారంటూ రేవంత్‌ను టార్గెట్ చేశారు. ఇంతలో తీపి కబురు చెప్పింది హైకమాండ్, మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ కొత్త మంత్రుల టీమ్ కేబినెట్‌లో చేరబోతోంది.ఇంతలా ప్రాధాన్యత సంతరించుకున్న నూతన మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నవారి సంఖ్య చాంతాడును మించే ఉంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్‌లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతో.. అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్‌కు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్‌మోహన్‌రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి రేసులో ఉన్నారు. నల్లగొండ నుంచి బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరు కూడా తెరపైకి వస్తోంది. తమకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించాలని కొద్దిరోజుల నుంచి పలువురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు కేబినెట్‌లో కచ్చితంగా ప్రాతినిథ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటాలో మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేసులో ఉండటంతో ఎలాంటి సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఈసారి కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.ఆశావాహులు అసంతృప్తి చెందకుండా మరో మూడు స్థానాలు ఖాళీ ఉంచాలని నిర్ణయించినట్టు సమాచారం.కాగా, ఇద్దరు మంత్రుల శాఖలు మార్చి.. కొత్త వారికి కేటాయించనున్నట్లు తెలుస్తున్నది. సీఎం రేవంత్​ దగ్గర ఉన్న శాఖతో పాటు మరో మంత్రి దగ్గర ఉన్న శాఖలను మార్చుతున్నట్లు చెబుతున్నారు.

  • నాలుగైదు ముహుర్తాలు.

ఆదివారం ఉదయం వరకు మంత్రి వర్గంలోకి తీసుకునే వారి పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా నాలుగైదు ముహుర్తాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పేర్లు నిర్దారణ అయ్యాక ఏ ముహుర్తంలో ప్రమాణ స్వీకారం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఆశావాహుల్లో కొంతమంది ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు టచ్​లోకి వెళ్లారు. కొంతమంది శనివారం రాత్రి ఢిల్లీ ఫ్లైట్​ ఎక్కారు.

  • హైదరాబాద్​కు గవర్నర్.​

ఈ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి వరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు రానున్నారు. గవర్నర్ రాజ్ భవన్ కు చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ వెళ్లి కలవనున్నారు. కొత్త మంత్రుల జాబితాను అందించనున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.