బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భువనగిరి జిల్లా బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను గురువారం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ సహా ఇతర ఉన్నత వైద్యాధికారులు ఆయనను సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో సమావేశమైన ఆయన ఎయిమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. అలాగే ఎయిమ్స్ లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎయిమ్స్ లో కొనసాగుతున్న భవన నిర్మాణపనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎయిమ్స్ అందిస్తున్న సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఎయిమ్స్ లోని అన్ స్కిల్డ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గోలి పింగల్ రెడ్డిలతో పాటు బీబీనగర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.