ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపిస్తున్న ఆశాస్త్రీయ ఆరోగ్య సూచనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనంతరం గౌరవ శాసనసభ్యులు జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.