ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు “మన ఇసుక – మన వాహనం” విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ఆన్‌లైన్ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లోని మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్‌లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఇసుక తవ్వకం, రవాణా విధానాలను పరిశీలించి, అధికారులతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉండాలని, ప్రతి వాహనం వివరాలు నమోదు కావాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు లేదా సిబ్బంది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత పెరిగి, అక్రమాలు తగ్గుతాయని, ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.