కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు
చూపులేకపోయినా కోట్లాది జీవితాల్లో వెలుగులు నింపిన వారున్నారు
అవయవ లోపం బలహీనత కాదు… మరో కోణంలో గెలిచే శక్తిగా భావించండి
మీ పరిమితిని నిర్ణయించేది మీ శరీరం కాదు… మీ ఆత్మవిశ్వాసం
దివ్యాంగుల సంక్షేమం, అభ్యున్నతి కోసం మోదీ సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది
యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే దివ్యాంగులకు 3 రెట్ల బడ్జెట్ ను అధికంగా కేటాయిస్తున్నాం.
భవిష్యత్తులో దివ్యాంగులందరికీ ఉపకరణాలు అందిస్తాం
దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :
సిరిసిల్లలో 466 మంది దివ్యాంగులకు రూ.84 లక్షల విలువైన 813 ఉపకరణాలను అందించిన కేంద్ర మంత్రి
అవయవ లోపం అనేది బలహీనత కాదని, జీవితాన్ని మరో కోణంలో గెలిచే శక్తిగా భావించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. కంటి చూపు లేకపోయినా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి ఎంతో మంది దివ్యాంగులు స్రుష్టించారని చెప్పారు. దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యమని అన్నారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగుల కోసం రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఉపకరణాలు అందించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే అత్యధిక నిధులు కేటాయిస్తోందన్నారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) ఆర్ధిక సహకారంతో ఈరోజు సరిసిల్ల పట్టణంలో 466 మంది దివ్యాంగులకు రూ.84 లక్షల విలువైన 813 ఉపకరణాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఐవోసీఎల్ సీజీఎం వినీత్ కౌర్, జడ్పీ సీఈవో, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ డీఆర్డీవో పద్మయ్య, అలీం కో టీం ప్రతినిధి చందన్, దివ్యాంగుల యూనియన్ నాయకుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ ఏమన్నారంటే…
ADIP (Assistance to Disabled Persons), ALIMCO పథకాల కింద సిరిసిల్ల జిల్లాలో ఈరోజు 84 లక్షల కేంద్ర నిధులతో 466 మంది దివ్యాంగులకు 813 పరికరాలను కొనుగోలు చేసి దివ్యాంగులకు అందజేయడం సంతోషంగా ఉంది. గతంలో కరీంనగర్ లో, వేములవాడలో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పెద్ద ఎత్తున పరికరాలను పంపిణీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. త్వరలోనే దివ్యాంగులందరికీ ఉపకరణాలు అందిస్తాం.
ఇవి మాత్రమే కాకుండా మహిళలు, పిల్లలు, వ్రుద్దుల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. అంగన్ వాడీ కేంద్రాల్లో బాలామ్రుతం, గుడ్డు సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నారు. గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం, గడ్లు, పాలుసహా అన్నింటికీ కేంద్రమే నిధులిస్తూ గర్భిణీ మహిళలు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగేలా చేస్తోంది. వ్రుద్దులకు, దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటోంది. నా పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు గర్బిణీ మహిళలు, పిల్లలు, వ్రుద్దులు, దివ్యాంగుల సంక్షేమం కోసం దాదాపు 100 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా..
అన్ని అవయవాలున్న వాళ్లే అనేక ఇబ్బందులు పడుతున్నారు… ఇక దివ్యాంగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందుకే వారు ఇబ్బందులను అధిగమించేలా చేసేందుకు మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా 466 మంది దివ్యాంగులకు 813 పరికరాలను ఈరోజు ఉపకరణాలు అందిస్తున్నాం. రానివాళ్లు బాధపడాల్సిన పనిలేదు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి అతి త్వరలో ఉప కరణాలు అందిస్తాం.
• గత 12 ఏళ్లుగా దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ADIP, ALIMCO, Accessible India, కేంద్ర సామాజిక సాధికారత శాఖ ద్వారా వేలాది కోట్లను దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఒక్క ఏడాదే రూ.1600 కోట్లు కేటాయించింది. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే 3 రెట్ల బడ్జెట్ ను అధికంగా కేటాయిస్తున్నారు. దివ్యాంగులకు ఉపకరణాలను అందజేయడంతోపాటు విద్య, ఉపాధి, డిజిటల్ ఐడీ, యాక్సెసిబుల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వారి హక్కులను కాపాడటంలో ముందున్నాం.
దివ్యాంగ సోదరులకు నేను చెప్పేదొక్కటే… మనిషి శరీరంతో కాదు…
మనసుతో గెలుస్తాడు. చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు…
కాళ్లు పనిచేయకపోయినా ప్రపంచాన్ని జయించినవారు ఉన్నారు. కళ్లలో వెలుగు లేకపోయినా కోట్ల మందికి దారి చూపినవారు ఉన్నారు.
అవయవ లోపం అనేది బలహీనత కాదు. అది జీవితాన్ని మరో కోణంలో గెలిచే శక్తిగా భావించండి. సమాజం కొన్నిసార్లు మిమ్మల్ని “పరిమితులు ఉన్నవారు”గా చూడొచ్చు. కానీ “మీ పరిమితిని నిర్ణయించేది మీ శరీరం కాదు… మీ ఆత్మవిశ్వాసం.”
జీవితంలో మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఇంతవరకు వచ్చారు అంటే… మీరు సాధారణ మనుషులు కాదు. ప్రతి ఉదయం మీరు చేసే పోరాటం. చాలామందికి జీవిత పాఠం. మీ చిరునవ్వు వెనుక బాధ ఉండొచ్చు. కానీ ఆ బాధను జయించే ధైర్యం కూడా మీలోనే ఉంది. మీరు ఉద్యోగాలు చేయగలరు. వ్యాపారాలు నిర్మించగలరు… కళల్లో, క్రీడల్లో, విద్యలో, టెక్నాలజీలో అద్భుతాలు చేయగలరు.
గుర్తుంచుకోండి…ఓటమి శరీరంలో కాదు… మనసులో మొదలవుతుంది. మీరు మీపై నమ్మకం పెంచుకున్న రోజునుంచి జీవితం మారిపోతుంది. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి “మీరు ఎవరికీ తక్కువ కాదు. మీ జీవితానికి మీరే హీరో. మీ అడుగులు నెమ్మదిగా ఉండొచ్చు. కానీ మీ గమ్యం గొప్పది కావాలి. మీరు నిలబడితే ఇంకో దివ్యాంగుడికి ధైర్యం వస్తుంది.
“అవయవ లోపం విజయానికి అడ్డంకి కానే కాదు… ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన వీరులు వీరంతా… వారి స్పూర్తితో ముందుకు సాగండి. దేవుడు మీ జీవితంలో ఒక తలుపు మూసివేసి ఉండొచ్చు… కానీ మీలో అసాధారణమైన శక్తి అనే మరో తలుపు తప్పకుండా తెరిచాడు. ఆ శక్తిని నమ్మండి. ముందుకు సాగండి. ప్రపంచం మీ విజయాన్ని చూసే గర్వించే రోజులు ఎంతో దూరంలో లేవు.